పరాయి పాలకుల కిరాయి మనుషులు
* కాంగ్రెస్‌పై కవిత మండిపాటు
* కమలానికి ఓటేస్తే చంద్రబాబుకు వేసినట్లే
* టీఆర్‌ఎస్ గెలిస్తేనే బంగారు ‘తెలంగాణ’
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మొదటి నుంచీ పదవుల కోసం పాకులాడిన టీ-కాంగ్రెస్ నాయకులు ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, వాళ్లు పరాయి పాలకుల కిరాయి మనుషులని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఆరోపించారు. గురువారం నిజామాబాద్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు.
మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్తూరుకు నిధులు ఎత్తుకెళ్తే నోళ్లు వెళ్లబెట్టారని ఎద్దేవా చేశారు. తెలంగాణ బిడ్డలు అరిగోస పడటానికి, ఆత్మహత్యలకు వాళ్లే కారణమన్నారు. అమరవీరుల త్యాగాల పునాదిపై, ఉద్యమాలతో ఏర్పడిన ‘తెలంగాణ’లో కాంగ్రెస్‌కు ఓట్లడిగే హక్కు లేదన్నారు. బీజేపీ చంద్రబాబు జేబుసంస్థగా మారిందని, ఆ పార్టీకి ఓటేస్తే తెలంగాణ ద్రోహి చంద్రబాబుకు వేసినట్లేనన్నారు. తెలంగాణలోని పది జిల్లాలకు చెందిన బీజేపీ అధ్యక్షులు రాజీనామా చేస్తామని హెచ్చరించినా, ఆంధ్రాబాబులు వెంకయ్యబాబు, చంద్రబాబుల లాబీయింగ్‌తో అనైతిక పొత్తులు ఏర్పడ్డాయన్నారు. దీనిని ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు.
విద్యుత్ చార్జీలు, కోతలను నిరసించిన రైతులపై చంద్రబాబు హయాంలో..గుళ్ల వర్షం కురిపించిన ‘బషీర్‌బాగ్’ సంఘటనను ప్రజలు ఇంకా మరచిపోలేదని కవిత గుర్తు చేశారు. ప్రాంతీయ పార్టీలను చిన్నగా చూస్తున్న కాంగ్రెస్, బీజేపీ కూడ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలేనన్న విషయం మరవకూడదన్నారు. తెలంగాణ పునర్‌నిర్మాణంలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని కవిత స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ అధికారంలో వస్తేనే బంగారు ‘తెలంగాణ’ నిర్మాణం అవుతుందని కవిత అన్నారు.