టాప్‌గేర్‌లో కారు
లోక్‌సభ స్థానాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఖరారు
పెండింగ్‌లో ఐదు అసెంబ్లీ స్థానాల అభ్యర్థిత్వాలు
సాక్షిప్రతినిధి, నల్లగొండ, టీఆర్‌ఎస్ మరో జాబితా విడుదల చేసింది. జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలు నల్లగొండ, భువనగిరితోపాటు కోదాడ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. డాక్టర్స్ జేఏసీ చైర్మన్‌గా పనిచేసిన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్‌ను భువనగిరి లోక్‌సభ స్థానానికి, మూడు నాలుగు రోజుల కిందటే పార్టీలో చేరిన పల్లా రాజేశ్వర్‌రెడ్డిని నల్లగొండకు ప్రకటించింది. కోదాడఅసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా అక్కడి ఇన్‌చార్జ్ శశిధర్‌రెడ్డి పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ గత ఏడాది టీఆర్‌ఎస్‌లో చేరారు. డాక్టర్స్ జేఏసీ చైర్మన్‌గా పనిచేసిన ఆయనకు భువనగిరి లోక్‌సభ సీటును కేటాయిస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పార్టీలో చేరి పనిచేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు నర్సయ్యగౌడ్ పేరును కనీసం ఇన్ చార్జ్‌గా కూడా పేర్కొనని టీఆర్‌ఎస్ నాయకత్వం చివరకు టికెట్ ఖరారు చేసింది. ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన భువనగిరిలో అవకాశం కల్పించడం కష్టమని భావించి ఇన్నాళ్లూ ఎదురుచూసినట్లు చెబుతున్నారు. ఇక, పొత్తు లేనట్టేనని భావించడం వల్లే భువనగిరికి నర్సయ్య గౌడ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.
మూడు నాలుగు రోజుల కిందటి దాకా నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.అయితే, కోదాడలో విద్యా సంస్థలు ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి నల్లగొండ లోక్‌సభ సీటును ఆశించే టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన రోజు ఎలాంటి హామీ ఇవ్వని కేసీఆర్ శనివారం మాత్రం రాజేశ్వర్‌రెడ్డి పేరును నల్లగొండ లోక్‌సభ స్థానానికి ఖరారుచేశారు.
కోదాడ అసెంబ్లీ నియోజకవ ర్గ ఇన్‌చార్జ్ కె.శశిధర్‌రెడి అభ్యర్థిత్వం కూడా ఖరారైంది. పార్టీలో చాలా కాలంగా కొనసాగతున్న శశిధర్‌రెడ్డికి రెండో జాబితాలో టికెట్ ఓకే కావడంతో ఆయన అనుచర వర్గంలో ఆనందం వ్యక్తం అవుతోంది.