బీజేపీ తరఫున పవన్‌కల్యాణ్ ప్రచారం
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌కల్యాణ్ రాష్ట్రంలో బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు అంగీకరించారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆయన కర్ణాటకలోని గురుమట్కల్, కోలార్, బళ్లారి తదితర ప్రాంతాల్లో ప్రచారానికి సిద్ధమయ్యారన్నారు. శుక్రవారం కిషన్‌రెడ్డి పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో కచ్చితంగా చెప్పలేనప్పటికీ, పరిస్థితి తాము ఊహించినదానికంటే మెరుగ్గా ఉందన్నారు. ఈ నెల 18,19, 20వ తేదీల్లో ఏదో ఒక రోజున మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.టీడీపీకి కేటాయించిన నియోజకవర్గాల్లో నామినేషన్ దాఖలు చేసిన పార్టీ అభ్యర్థులను ఉపసంహరించుకోవాల్సిందిగా సూచించినట్టు చెప్పారు.
అంబర్‌పేట నియోజకవర్గంలో తన గెలుపు తథ్యమని, కాంగ్రెస్ అభ్యర్థి హనుమంతరావు స్థానిక సమస్యలను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. గతంతో పోలిస్తే టీఆర్‌ఎస్ బలం బాగా తగ్గిందని, అందుకే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారన్నారు. కాగా, శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం కుమార్తె పాదూరి కరుణ, మాజీ ప్రధాని, దివంగత పీవీ నర్సింహారావు మనవడు ఎన్.వి. సుభాష్, పీసీసీ మాజీ కార్యదర్శి వెంకటరాంరెడ్డి, పారిశ్రామికవేత్త ఎన్.రితేష్, సామాజికవేత్త అమర్‌జిత్‌కౌర్, వ్యాపారవేత్తలు సునీల్‌శర్మ, సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, నల్లగొండ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, డ్వాక్రా సంఘాల నాయకురాళ్లు పాదూరి ఇందు, ఉమాదేవి తదితరులు తమ అనుచరులతో కలసి కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయల సమక్షంలో బీజేపీలో చేరారు.