'హైదరాబాద్ ఎవరి జాగీరూ కాదు'
విజయవాడ : ఇటలీ నుంచి వచ్చినవాళ్లు దేశాన్ని ఏలొచ్చు కానీ... ఇప్పటిదాకా హైదరాబాద్లో ఉన్నవాళ్లు ఇక మీదట హైదరాబాద్లో ఉండటానికి వీల్లేదా అని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. సోమవారం ఆయన మీట్ ది ప్రెస్లో మాట్లాడుతూ బీజేపీ మతతత్వ పార్టీ అంటున్న కేసీఆర్ మాతో పొత్తుకు ఎందుకు వెంపర్లాడరన్నారు.
హైదరాబాద్లో ఉన్నవాళ్లంతా హైదరాబాదీలే అని హైదరాబాద్ ఎవరి జాగీరూ కాదని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రాంతీయ, మత విద్వేషాలను రెచ్చగొడుతున్న వారికి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. దేశంలో సీబీఐ కాంగ్రెస్ జేబు సంస్థగా మారిందన్నారు. కాంగ్రెస్ రహిత దేశం కోసమే టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుందన్నారు. ఇక దేశంలో కాంగ్రెస్ శకం ముగిసిందని, బీజేపీ అధికారంలోకి వస్తే ధార్మిక పరిరక్షణ చట్టాలను తీసుకొస్తుందని వెంకయ్యనాయుడు అన్నారు.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, మోడీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం కావాలని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. అప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. మూడో, నాలుగో కూటమి నాయకులంతా ప్రధానులు కావాలనుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వారి ప్రయత్నాలు సఫలం కావని, జరగనున్న ఎన్నికల్లో ఎన్డీయేకు స్పష్టమైన మెజార్టీ లభిస్తుందని వెంకయ్య జోస్యం చెప్పారు. దేశమంతా మోడీ గాలివీస్తోందని ఆయన తెలిపారు.