
హ్యాట్రిక్ సాధించిన పితాని
ఆచంట అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు.
ఆచంట, న్యూస్‌లైన్: ఆచంట అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. పితాని వైఎస్సార్ సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజుపై 3,920 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2004లో పెనుగొండ నియోజకవర్గం నుంచి పితాని తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పెనుగొండ నియోజకవర్గం రద్దు కావడంతో పితాని ఆచంట నుంచి పోటీ చేసి రెండవసారి విజయం సాధించారు.
అనంతరం ఆయనకు దివంగత వైఎస్ మంత్ర పదవిని కట్టబెట్టారు. రాష్ట్ర విభజన అనంతరం మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరిన పితాని ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు టీడీపీ చేరి ఆచంట నుంచి పోటీ చేశారు. నియోజకవర్గంలో మొత్తం 1,59,559 ఓట్లు ఉండగా 1,29,833 ఓట్లు పోలయ్యాయి. వీటిలో పితాని సత్యనారాయణకు 63,549 ఓట్లు ప్రసాదరాజుకు 59,629 ఓట్లు లభించాయి. మూడో స్థానంలో సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసిన కేతా గోపాలన్‌కు 1654 ఓట్లు రాగా కాంగ్రెస్ 1641 ఓట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది.