డబ్బు తరలింపులో రోజుకో కొత్త మార్గం
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు. కార్లలో డబ్బులు తీసుకెళ్తుంటే పోలీసులు అణువణువూ గాలించి మరీ పట్టేసుకుంటున్నారు. కనిపించిన ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దీంతో రాజకీయ నాయకులు డబ్బులు పంపడానికి ద్విచక్ర వాహనాలను ఎంచుకున్నారు. మోటార్ సైకిళ్ల మీద వెళ్లే వారిని పెద్దగా పట్టించుకోవట్లేదన్న భావనతో, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లలా వెనకాల ల్యాప్టాప్ బ్యాగులు తగిలించి, వాటిలో కంప్యూటర్లకు బదులు డబ్బులు పెట్టి పంపుతున్నారు.
ఈ విషయం పోలీసులకు ఎలా లీకైపోయిందో గానీ, వాళ్లు కూడా ఈ విషయాన్ని పట్టేశారు. మోటార్ సైకిళ్ల మీద వెళ్లేవాళ్లను కూడా వదలకుండా గాలించడం మొదలుపెట్టారు. ఇలాగే హైదరాబాద్ శివార్లలోని మియాపూర్ ప్రాంతంలో మోటార్ సైకిళ్ల మీద వెళ్లేవారిని తనిఖీ చేస్తుండగా, ఒకరి వద్ద 30 లక్షల రూపాయలు దొరికాయి. ఎన్నికల సందర్భంగా పంచిపెట్టేందుకు భారీమొత్తంలో తీసుకెళ్తున్న సొమ్మును పోలీసులు ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నారు. పాతబస్తీలో ఇటీవల ఏకంగా కోటి రూపాయలకు పైగా నగదు, రెండు కిలోల బంగారం కూడా పట్టుకున్న విషయం తెలిసిందే. కార్లు, ద్విచక్ర వాహనాలు అయిపోవడంతో ఇక ఇప్పుడు సిటీ బస్సుల్లోనో, ఇంటర్ సిటీ బస్సుల్లోనో నగదు తరలించేందుకు ప్రయత్నాలు చేయొచ్చని, వాటిని కూడా తాము సమర్ధంగా అడ్డుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.