ఆమె పోటీ టీడీపీ నిర్ణయంతో ముడి
బీజేపీ, టీడీపీ మధ్య మళ్లీ సీట్లపై చర్చ
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో చేరిన మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేయాల్సిన సీటు కోసం బీజేపీ, టీడీపీ మధ్య సీట్ల కేటాయింపు ఆఖరి నిమిషంలో మడత పేచీ పడింది. అరకు లోక్‌సభ బదులు ఒంగోలు లోక్‌సభ సీటు కావాలంటూ బీజేపీ పట్టుబట్టడంతో రెండు పార్టీల మధ్య తిరిగి మొదలైన సీట్ల పంచాయితీ మరికొన్ని సీట్ల విషయంలోనూ అస్పష్టత ఏర్పడే వరకు వెళ్లింది.
దీంతో బీజేపీ పోటీ చేసే స్థానాలపై రెండు పార్టీల మధ్య చర్చలు మొదలయ్యాయి. బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు హరిబాబు, ఎన్నికల కమిటీ సంఘం కన్వీనర్ వీర్రాజులతో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలు పలువురు హైదరాబాద్‌లో సమావేశమై.. పోటీ చేసే స్థానాల స్పష్టత కోసం టీడీపీ ఎంపీ సుజనా చౌదరితో చర్చించారు. నాలుగు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ సీట్ల విషయంలో రెండు పార్టీల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు వ్యక్తం కానట్టు సమాచారం.
విశాఖపట్నం, నరసా పురం, తిరుపతి, రాజంపేట లోక్‌సభ సీట్లతో పాటు విశాఖ నార్త్, రాజమండ్రి సిటీ, తాడేపల్లిగూడెం, నరసరావుపేట, నెల్లూరు రూరల్, మదనపల్లి, పాడేరు, కడప, సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గాలలో బీజేపీ పోటీకి టీడీపీ ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
అరకు లోక్‌సభ సీటును వదులుకునేందుకు బీజేపీ నేతలు సుముఖత వ్యక్తం చేస్తూనే, దాని బదులుగా టీడీపీ ఏ సీటును ప్రతిపాదిస్తుందన్న దానికోసం వేచిచూస్తున్నారు. అరకు లోక్‌సభ సీటుతో పాటు నరసన్నపేట, గజపతినగరం, రాజోలు, విజయవాడ సెంట్రల్, అనంతపురం, రాజంపేట అసెంబ్లీ స్థానాల మార్పిడిపై రెండు పార్టీల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. అరకు లోక్‌సభ సీటు తీసుకొని, బదులుగా ఒంగోలు లోక్‌సభ స్థానం కేటాయించాలని బీజేపీ పట్టుబడుతోంది.
అయితే సుజనా చౌదరి మాత్రం అరకు కాకుండా విశాఖపట్నం టీడీపీకి ఇస్తే అందుకు బదులుగా కోరుకున్న సీటు ఇస్తామని ప్రతిపాదించడంతో కమలం నేతలు మిన్నకుండిపోయినట్టు సమాచారం. కాగా, పొత్తులో భాగంగా బీజేపీకి దక్కిన ఐదింటిలో నాలుగు లోక్‌సభ సీట్లలో బీజేపీ రాష్ట్ర నేతలు ప్రాథమికంగా అభ్యర్థులను ఖరారు చేసి ఢిల్లీకి పంపినట్టు సమాచారం. అరకు లోక్‌సభ స్థానం మార్పిడికి టీడీపీ అంగీకరించే దానిపై పురందేశ్వరి పోటీ చేసేదీ లేనిదీ ఆధారపడి ఉంది.
పురందేశ్వరి కోసం మడత పేచీ
Published Sun, Apr 13 2014 2:50 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement