రాహుల్ గాంధీ
ప్రతాప్‌గఢ్(యుపి): ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రతాప్‌గఢ్ నియోజకవర్గంలో జరిగిన సభతో రాహుల్‌గాంధీ చేసిన ప్రసంగంతో గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీనే లక్ష్యంగా చేసుకున్నారు. గుజరాత్‌లో అభివద్ధి మోడీ వల్ల సాధ్యమైందని కాదన్నారు. అది అక్కడి ప్రజల కష్టార్జితమన్నారు. బీజేపీ ఘర్షణతో కూడిన రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీకి అధికారమే పరమావధి అంటూ విమర్శలు గుప్పించారు. గుజరాత్‌లోని మారుమూల గ్రామాలమహిళల కష్టమే అమూల్ వంటి విజయగాథలకు కారణమని మరచిపోకూడదన్నారు.
ఒకరికి వ్యతిరేకంగా మరొకరు గోతులు తీసే రాజకీయాలను, ఘర్షణతో కూడిన రాజకీయలను తాము విశ్వసించబోమన్నారు. అన్ని మతాలు, కులాల ప్రజల మధ్య శాంతి, ప్రేమను పెంపొందిస్తామన్నారు. యూపీలో శాంతి, సామరస్యం నెలకొంటే మహారాష్ట్ర, గుజరాత్‌తోపాటు, ఇంగ్లండ్ వంటి దేశాల నుంచి కూడా ప్రజలు తమ ఆర్థిక ఉన్నతి కోసం వస్తారని చెప్పారు. ప్రచారం విషయంలో బీజేపీని వెనక్కి నెట్టేస్తామన్నారు. ప్రజలకు హామీల విషయంలో ఆ పార్టీ తమకంటే అడుగు వెనకే ఉంటుందన్నారు. అదే అవినీతి విషయానికొస్తే కాంగ్రెస్ కంటే బీజేపీ ముందుంటుందని చెప్పారు. సమాచార హక్కుచట్టం, లోక్‌పాల్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు. వారు వీటిని అడ్డుకోవడానికి ప్రయత్నించారని రాహుల్ గాంధీ చెప్పారు.