కేసీఆర్‌ది వెన్నుపోటు: రాహుల్ గాంధీ | Rahul Gandhi lashes out at K chandra sekhar rao | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ది వెన్నుపోటు: రాహుల్ గాంధీ

Published Tue, Apr 22 2014 1:59 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కేసీఆర్‌ది వెన్నుపోటు: రాహుల్ గాంధీ - Sakshi

కేసీఆర్‌ది వెన్నుపోటు: రాహుల్ గాంధీ

 (మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధులు)
 
 ‘కొన్ని రోజుల క్రితం ఆ పెద్దమనిషి నా ఇంటికి వచ్చాడు... నాతో ఐదు నిమిషాలు మాట్లాడాలని కోరాడు. నా కార్యాలయానికి వచ్చాడు. నన్ను కలిశాడు. చేతిలో చేయి కలిపాడు. నేనేమో తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలని అడిగాను. కాని ఆ పెద్ద మనిషి నేను మీతోనే ఉంటాను. మీ పార్టీతో ఉంటాను అని చెప్పాడు. నన్ను ఆలింగనం చేసుకుని.. నేను మీతోనే ఉంటానని మళ్లీ చెప్పాడు. ఏమి జరిగినా సరే అన్నాడు. కానీ బయటకు వచ్చిన తరువాత గుండెకు గుండె పెట్టి చెప్పిన మాటను మరిచిపోయాడు. కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణలోని నాలుగన్నర కోట్ల ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచాడు’ అని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ మాట తప్పారు. తొలి సీఎం దళితుడేనన్న వాగ్దానాన్నీ ఆయన మర్చిపోయారు. టీఆర్‌ఎస్‌కు అధికారమిస్తే ఇప్పుడు ప్రజలకిస్తున్న హామీల సంగతి కూడా అంతే’నని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారం కోసం సోమవారం తొలిసారి తెలంగాణలో అడుగుపెట్టిన కాంగ్రెస్ యువ నేత శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా మహబూబ్‌నగర్‌కు వెళ్లారు. అక్కడి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. వేదికపైకి రాగానే తెలంగాణ  ఉద్యమసిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటాలకు నివాళులర్పించారు. అనంతరం 25 నిమిషాలపాటు ప్రసంగించిన రాహుల్.. తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని గుర్తు చేస్తూనే టీఆర్‌ఎస్ అధినేతపై విమర్శలు గుప్పించారు. అనంతరం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం సాంపల్లి శివారులో ఏర్పాటు చేసిన సభలోనూ రాహుల్ పాల్గొన్నారు. ఆయన ప్రసంగాల సారాంశమిది..
 
 మాట నిలబెట్టుకున్నాం: ‘తెలంగాణ ప్రజల 60 ఏళ్ల స్వప్నం జూన్ 2 నాటికి నిజం కాబోతోంది. తెలంగాణ సమాజం యావత్తూ ఈ ఉద్యమంలో పాలుపంచుకుంది. వందలాది మంది బలిదానం చేసుకున్నారు. వారందరికీ నివాళులు అర్పిస్తున్నాను. మీ అందరి ఆకాంక్షలను అర్థం చేసుకున్నాం. ఉద్యమాన్ని గౌరవించాం. ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్దంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేశాం. తెలంగాణ కల సాకారంలో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన పాత్రను పోషించింది. సోనియా గాంధీ కృషి వల్లే తెలంగాణ సాధ్యమైంది. కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు. ఈ విషయంలో మేం చేయగలిగిందే చెప్పాం. ఇచ్చిన మాట మేరకు తె లంగాణను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ.. సీమాంధ్రకు ఇచ్చిన హామీలను కూడా పూర్తి చేస్తుంది’ అని రాహుల్ ఉద్ఘాటించారు. త్వరలోనే తెలంగాణ ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చేలా అభివృద్ధి చేసి చూపెడతామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ తప్పక అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
 
 టీఆర్‌ఎస్‌కు కావాల్సింది అధికారమే: ‘తెలంగాణ బిల్లు రాకుండా తెలుగుదేశం, బీజేపీ అడ్డుకున్నాయి. బిల్లు రూపకల్పనలో, పార్లమెంటు ఆమోదంలో టీఆర్‌ఎస్ పాత్ర ఎక్కడా లేదు. 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భవించినా.. అంతకుముందే 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ తీర్మానం చేసి పంపారు. దేశంలో, తెలంగాణలో సామాజిక న్యాయం సాధించేందుకు కృషి చేస్తున్నాం. కవ్వింపు, ఉద్రేక చర్యలకు కాంగ్రెస్ వ్యతిరేకం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా వర్గాలకు భద్రత చేకూర్చినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్లుగా భావిస్తామ’ని రాహుల్ తెలిపారు. హామీలివ్వడంలో ముందున్న టీఆర్‌ఎస్.. అధికారంలోకొస్తే వాటన్నింటినీ మర్చిపోతుందన్నారు. టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు కావాల్సింది అధికారమేనని ఆయన విమర్శించారు.
 
 తెలంగాణను తీర్చిదిద్దుతాం: ‘తెలంగాణ అగ్ర రాష్ట్రంగా ఎదగాలంటే దూర దృష్టి కావాలి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎలాంటి పాలన అందిస్తుందో, ఎంతటి ప్రగతి సాధించిందో అంద రికీ తెలుసు. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేస్తే అద్భుత ప్రగతి సాధిస్తుంది. అట్టడుగు వర్గాలకు సముచిత న్యాయం చేయడంతోపాటు తెలంగాణ ప్రజలందరికీ సంతృప్తి కలిగేలా అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాంతంలో 4 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్‌ను నిర్మిస్తాం. తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలకు పదేళ్ల టాక్స్ హాలిడేను అమలు చేస్తాం. హైదరాబాద్ ఆదాయాన్ని తెలంగాణకే వినియోగిస్తాం. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా కల్పిస్తాం. తెలంగాణ యువత వృత్తి నైపుణ్యం సాధించేలా కృషి చేస్తాం’ అని రాహుల్ వివరించారు.
 
 ప్రజలను విభజించాలని చూస్తున్నారు: ‘భారత్‌లో సంపన్నులు ఒకవైపు, ఆకలితో అలమటించే వారు మరోవైపు ఉండాలని విపక్షాలు కుట్ర చేస్తున్నాయి. హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు పెంచుతున్నాయి. ప్రజలను విభజించాలని చూస్తున్న పార్టీ ఏదో.. ఆ నేత ఎవరో అందరికీ తెలుసు’ అని బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీని పరోక్షంగా విమర్శించారు. కాంగ్రెస్ మాత్రం అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడుతోందని పేర్కొన్నారు. ‘పదేళ్ల యూపీఏ పాలనలో ఉపాధి హామీ పథకం ద్వారా 15 కోట్ల మందిని ఆకలికి దూరంగా ఉంచగలిగాం. పేద వర్గాల పిల్లలకు ప్రాథమిక విద్యను అందించగలిగాం. ఇది మా అద్భుతమైన ప్రగతి. మళ్లీ అధికారమిస్తే దేశ ప్రగతిలో ప్రతి నిరుపేదకూ భాగస్వామ్యం కల్పిస్తాం. రాబోయే మూడేళ్లలో సురక్షిత నివాసాలను నిర్మిస్తాం. దేశంలో, తెలంగాణలో ఇల్లు లేని పేదలుండరు. రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత ఆరోగ్యసేవలు, మందుల పంపిణీ వ్యవస్థ, స్వయం సహాయక సంఘాలను ఆదర్శంగా తీసుకుని దేశ వ్యాప్తంగా అమలు చేస్తామ’ని రాహుల్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదింపజేస్తామని, దేశ వ్యాప్తంగా రెండు వేల మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని కూడా హామీలిచ్చారు. మహిళలకు పూర్తి స్థాయిలో ఉచిత ఆరోగ్య సేవలు అందేలా చేస్తామని, సక్రమంగా పింఛన్లు అందిస్తామని పేర్కొన్నారు.
 
 చిన్న కలనా.. పెద్ద స్వప్నమా తేల్చుకోండి: ‘యువత ఉపాధి, ఉద్యోగావకాశాలను కోరుతోంది. మార్కెట్లో ఏ వస్తువులు కొనుగోలు చేసినా వాటిపై ‘మేడ్ ఇన్ చైనా’ అని ఉంటోంది. మన డబ్బును ఖర్చు చేసి విదేశీ వస్తువులను కొంటున్నాం. ఇకపై టీ షర్ట్ మొదలు చెప్పుల వరకు ఏది కొనుగోలు చేసినా ‘మేడ్ ఇన్ ఇండియా’, ‘మేడ్ ఇన్ తెలంగాణ’ వస్తువులే ఉండేలా ఉత్పత్తి సాధించాలి. బయట మార్కెట్లో ఇకపై కెమె రా, మొబైల్‌సహా అన్నింటిపైనా ‘మేడ్ ఇన్ తెలంగాణ’ పేరు కనిపించాలి. అది కాంగ్రెస్ వల్లే సాధ్యం. ఇందుకోసం దేశవ్యాప్తంగా పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం. పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాం. తద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తాం. తెలంగాణ కొత్త రాష్ర్టం వచ్చింది. ఇప్పుడు మీరు చిన్న కలను సాకారం చేసుకుంటారా? లేక ఇలాంటి పెద్ద స్వప్నాన్ని సాకారం చేసుకుంటారా? మీరే ఆలోచించండి. చిన్న కలతో మీ శక్తి నిర్వీర్యమవుతుంది. ‘మేడ్ ఇన్ తెలంగాణ’ సాకారం కావాలన్నా, అద్భుత ప్రగతి సాధించాలన్నా కాంగ్రెస్‌కు అండగా నిలవండి’ అని రాహుల్ పేర్కొన్నారు. ఈ సభల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రామచంద్ర కుంతియా, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మ య్య, నేతలు రాజనర్సింహ, డి.శ్రీనివాస్, పి.సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, సురేష్ షెట్కార్, మధుయాష్కీ పాల్గొన్నారు.
 
 టీఆర్‌ఎస్ చిల్లర కొట్టు దుకాణం: జైపాల్
 
 టీఆర్‌ఎస్ పార్టీ చిల్లరకొట్టు దుకాణమని మహబూబ్‌నగర్ సభలో అక్కడి ఎంపీ అభ్యర్థి జైపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘టీఆర్‌ఎస్ చిల్లర కొట్టు దుకాణం. దాన్ని ఎప్పుడు మూసివేస్తారో, ఎప్పుడు తెరుస్తారో అందరికీ తెలుసు. ఆ విషయం కేసీఆర్‌కూ తెలుసు’ అని వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ చెవిలో జోరీగలా చేరి పదేపదే తెలంగాణ కావాలని పైరవీ చేశానని చెప్పారు. కేసీఆర్ పదేపదే రెచ్చగొట్టడం వల్లే అమాయకులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు. పొన్నాల, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement