కేసీఆర్‌పై ఫైర్ | congress leaders on kcr fire | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌పై ఫైర్

Published Sun, Apr 27 2014 3:21 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

కేసీఆర్‌పై ఫైర్ - Sakshi

కేసీఆర్‌పై ఫైర్

- టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే కుటుంబపాలనే..
- సామాజిక తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యం
- ఆసిఫాబాద్‌లో గిరిజన యూనివర్సిటీ
- బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ సభల్లో కాంగ్రెస్ అగ్ర నేతలు

 
 సాక్షి, మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావును కాంగ్రెస్ అగ్రనేతలు లక్ష్యంగా చేసుకున్నారు. కేసీఆర్‌పై మండిపడ్డారు. ఆయనకు ఓటేస్తే కుటుంబ పాలన వస్తుందని అన్నారు. శనివారం బెల్లంపల్లిలో, ఆదిలాబాద్‌లో కేంద్ర మంత్రి జైరాం రమేశ్ పర్యటించగా, ఆసిఫాబాద్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ ముందు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా కేంద్ర మంత్రి జైరాం రమేశ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తం కుమార్‌రెడ్డి,మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రసంగించారు.

 కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్‌దే అధికారం
                                          - కేంద్ర మంత్రి జైరాం రమేశ్
 కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారే అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ అన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే తెలంగాణలో కుటుంబ పాలన తప్ప సామాజిక న్యాయం దక్కదని పేర్కొన్నారు. టిక్కెట్ల కేటాయింపులో కేసీఆర్ అవలంభించిన తీరే ఇందుకు నిదర్శనమన్నారు. కేసీఆర్ ప్రజలకు చేసిందేమీలేదని, తెలంగాణ ఆకాంక్షను గుర్తించింది కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీయేనన్నారు. ఏ ఒక్క కుటుంబం కోసం తెలంగాణ  ఏర్పాటు చేయలేదన్నారు.దొరల కుటుంబానికి చెందిన 15 మంది ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యే అభ్యర్థులకు టికెట్టిచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌దే నన్నారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం అవుతార ని జోస్యం చెప్పారు.

టిక్కె ట్ ఇవ్వలేదనే మనస్తాపంతో రెబల్‌గా ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి చిలుముల శంకర్ పోటీ నుంచి తప్పుకొంటున్నారని ప్రకటించారు. శంకర్‌పై విధించిన సస్పెన్షన్‌ను వెంట నే ఎత్తివేయాల్సిందిగా పొన్నాల లక్ష్మయ్యకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తున్నట్లు తెలిపారు. తనకు టిక్కెట్టు దక్కలేదనే మనస్తాపంతో పోటీ చేస్తున్నప్పటికీ అధిష్టానం సూచన ఉపసంహరించుకుంటున్నానని శంకర్ చెప్పారు. గుండా మల్లేశ్‌కు సహకారం అందిస్తానని ప్రకటించారు.

 ఆసిఫాబాద్‌లో గిరిజన యూనివర్సిటీ    ఏర్పాటు చేస్తాం..
                                           - తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు లక్ష్మయ్య
 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆసిఫాబాద్‌లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. 2009లో కరీంనగర్ ఎన్నికల ప్రచార సభలో సోనియా గాంధీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రం ప్రకటించారు. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ సమయంలో కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. పార్లమెంటులో తెలంగాణ గురించి ఒక్క సారి కూడా మాట్లాడని కేసీఆర్ తెలంగాణ తామే తెచ్చామంటే ప్రజలు నమ్మరు. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పిన కేసీఆర్  మాట తప్పారు. సామాజిక తెలంగాణ, సుస్థిర పాలన కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యం అని అన్నారు.

 సోనియాకు కృతజ్ఞతగా ఓటు వేయాలి..
                                           - టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్
 ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటు చే శారని అందుకు కృతజ్ఞతగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి కోరారు. పార్లమెంటు, అసెంబ్లీలో ఎన్నో అడ్డంకులు వచ్చినా బంగారు తెలంగాణ సాధన కోసం ఎంపీ, ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జైపూర్‌లో రూ.20 వేల కోట్లతో 4 వేల మెగవాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామని అన్నారు. వృద్ధులు, వితంతువుల పింఛన్ రూ. 1000, వికలాంగులకు రూ.1500 పింఛన్ పెంచుతామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

 టీఆర్‌ఎస్‌కు సిద్ధాంతం లేదు..  
                                - దామోదర్ రాజనరసింహ
 టీఆర్‌ఎస్‌కు సిద్ధాంతం లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఈ ఎన్నికలు ఎంతో చారిత్రాత్మకమైనవని చెప్పారు. తెలంగాణ ఇస్తే ఆంధ్రా, రాయలసీమలో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా, ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా తెలంగాణ ఇచ్చిందన్నారు.

 ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత కాంగ్రెస్‌దే అన్నారు. దళితులకు మఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ సీఎం పదవి కోసం మాట తప్పిన మోసగాడన్నారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులు జి.వివేకానంద, నరేశ్ జాదవ్, ఆసిఫాబాద్, సిర్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఆత్రం సక్కు, ప్రేంసాగర్ రావు, బెల్లంపల్లి సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థి గుండా మల్లేశ్, కాంగ్రెస్ రాష్ర్ట నేతలు సూరిబాబు, గడ్డం జగన్నాథం, సీపీఐ నాయకులు  కె.శంకర్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.

 ఉత్కంఠకు గురి చేసిన ల్యాండింగ్
 ఆసిఫాబాద్‌లో ల్యాండ్ అవ్వాల్సిన హెలిక్యాప్టర్‌కు సిగ్నల్స్ అందకపోవడంతో దాదాపు 20 నిమిషాలపాటు గాలిలో చక్కర్లు కొట్టింది. ఈ సమయంలో హెలిక్యాప్టర్‌లో జైరాం రమేశ్‌తోపాటు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఉన్నారు. ఎట్టకేలకు ల్యాండ్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement