శ్రీరామసేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ బీజేపీపై తిరుగుబాటు చేశారు. గత ఆదివారం బీజేపీ సభ్యత్వాన్ని ఇచ్చినట్లే ఇచ్చి రద్దు చేసిన ఆ పార్టీ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆయన ఈ లోక్‌సభ ఎన్నికల్లో ధార్వాడ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు.
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శ్రీరామసేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ బీజేపీపై తిరుగుబాటు చేశారు. గత ఆదివారం బీజేపీ సభ్యత్వాన్ని ఇచ్చినట్లే ఇచ్చి రద్దు చేసిన ఆ పార్టీ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆయన ఈ లోక్‌సభ ఎన్నికల్లో ధార్వాడ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. బుధవారం నామినేషన్‌ను దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. అదే నియోజక వర్గం నుంచి బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి పోటీ చేస్తున్నారు. బెల్గాం నుంచి కూడా తమ అభ్యర్థి రమాకాంత్ హొర్నూర్‌కర్ పోటీ చేస్తారని హుబ్లీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముతాలిక్ ప్రకటించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బెంగళూరు దక్షిణ అభ్యర్థి అనంత కుమార్ తనకు బీజేపీలో స్థానం లేకుండా చేశారని ఆరోపించారు. కనుక ఆయనపై కూడా పోటీ చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు.
అనంత కుమార్ పరమ అవినీతిపరుడని, రూ.వేల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపించారు. ‘ఆయన అవినీతి అనంతం’ అంటూ విరుచుకు పడ్డారు. హిందూ సృస్కతి పరిరక్షణకు నడుం బిగించిన తనను బీజేపీ దారుణంగా వంచించిందని ఆక్రోశించారు. తనపై అనేక కేసులు బనాయించినా, సంస్కృతిని రక్షించే విషయంలో వెనకడుగు వేయలేదని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న తమకు ముస్లింల ఓట్లు అవసరమే లేదని తెగేసి చెప్పారు.