సాక్షి, బెంగళూరు : ‘నేనెప్పుడు మంత్రి పదవిలోనే ఉంటానని అనడానికి ఆ పదవి ఎవరబ్బ సొత్తూ కాదు. మంత్రి పదవి నుంచి నన్ను తొలగిస్తే నేరుగా హెలికాఫ్టర్ ఎక్కి దావణగెరె వెళ్లిపోతాను. అక్కడ నా సొంత ఇంటిలో మిగతా జీవితాన్ని గడిపేస్తాను’ అని రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి శామనూరు శివశంకరప్ప వ్యాఖ్యానించారు. లాల్‌బాగ్‌లో ఏర్పాటైన మామిడి, పనస మేళాను ఆయన శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో మంత్రి వర్గంలో మార్పులు చేర్పులపై విలేకరులు అడిగిన ప్రశ్నకు శామనూరు ఇలా స్పందించారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సరైన ఫలితాలను సాధించలేకపోవడానికి మోడీ హవానే కారణమని అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే దావణగెరె పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ ఓటమి పాలైందని విశ్లేషించారు.
లోక్‌సభ ఎన్నికల ఓటమికి బాధ్యులను చేస్తూ మంత్రులను తొలగించాల్సి వస్తే చాలా మందిని తొలగించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. మంత్రి వర్గంలో మార్పులపై తనకెలాంటి సమాచారం లేదని, ఇదంతా కేవలం మీడియా సృష్టేనని కొట్టిపారేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అనుకున్న విజయాలను సాధించడంలో వెనకబడింది. దీంతో ఆయా పార్లమెంటు స్థానాలకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించిన మంత్రులపై వేటు వేసే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శామనూరు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఎవరబ్బ సొత్తూ కాదు
Published Sat, May 24 2014 12:12 PM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement