- బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పిలుపు
- అభివృద్ధి మంత్రంతో కమలం మళ్లీ వికసిస్తుంది
- ‘ఉప’ పరాజయంపై నిరాశ వద్దు
- ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలకు పిలుపు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి కర్ణాటకకు విముక్తి కల్పించాల్సిందిగా కార్యకర్తలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పిలుపునిచ్చారు. బీదర్ జిల్లా బసవ కళ్యాణ తాలూకా గోరటాలో 1948లో జాతీయ జెండాను ఎగుర వేసినందుకు రజాకార్ల పాశవిక దాడిలో హత్యకు గురైన 200 మంది మత్యర్థం నిర్మించదలచిన అమర వీరుల స్మారకానికి, సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా యువ మోర్చా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రజలు మళ్లీ అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తే, కమలం మళ్లీ వికసిస్తుందని చెప్పారు. రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిష్క్రియగా తయారైందని ఆరోపిస్తూ, ఈ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే ఒక ప్రధాన కార్యక్రమాన్నైనా చేపట్టిందా అని ప్రశ్నించారు.
ఉప ఎన్నికల్లో పరాజయంపై ఆందోళన వద్దు
దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురైన ఓటమి గురించి ఆందోళన చెందవద్దని కార్యకర్తలకు ఆయన ధైర్యం చెప్పారు. వచ్చే నెలలో జరుగనున్న మహారాష్ట్ర, హర్యానా శాసన సభ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తాను ఈ రెండు రాష్ట్రాల్లో పర్యటించానని, ఎన్నికల అనంతరం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. బీజేపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెబుతూ, విజయోత్సవాలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
బీజేపీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉందని, కనుక ఉప ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందకుండా ప్రధాని మోడీ చేతులను బలోపేతం చేయాలని ఆయన కోరారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు యడ్యూరప్ప మాట్లాడుతూ, బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకు రావడానికి సమైక్యంగా పని చేస్తామని అమిత్ షాకు హామీ ఇచ్చారు. గొరటాలో నిర్మించదలచిన అమర వీరుల స్మారకానికి జాతీయ హోదా కల్పించాల్సిందిగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. కాగా ఈ సభ అనంతరం అమిత్ షా పార్టీ రాష్ట్ర శాఖకు పలు సూచనలు చేశారు. అర్కావతి లేఔట్ డీనోటిఫికేషన్‌పై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై కూడా నిరంతరం ఆందోళనలు చేపట్టాలని సలహా ఇచ్చారు.