అమ్మ ఆదేశంతోనే వచ్చా
సిరిసిల్ల రాజయ్య ఘటన దురదృష్టకరం
కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ
హన్మకొండ అర్బన్: వరంగల్‌లో ఉప ఎన్నికల పోటీ విషయంలో అధినేత్రి సోనియమ్మ స్వయంగా చెబితేనే పోటీలో దిగుతున్నానని వరంగల్ పార్లమెంట్‌కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సర్వే సత్యనారాయణ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో నామినేషన్ వేసిన అనంతరం పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే నామినేషన్ వేసిన సిరిసిల్ల రాజయ్య ఇంట్లో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు.
రాజయ్యకు వస్తాయనుకున్న దానికన్నా మూడింతలు ఎక్కువ మెజార్టీ తనకు వస్తుందన్నారు. తనకు పార్టీలో గ్రూపులు లేవని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళతానన్నారు. తాను గెలిచి ఓరుగల్లును అభివృద్ధిబాటలో నడిపిస్తానన్నారు. ఆయన వెంట పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లురవి, డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.