ఏం చేద్దామో చెప్పండి !
కాంగ్రెస్ కురువృద్ధుడు ఎస్‌ఎంకృష్ణకు సోనియా గాంధీ ఫోన్
బెంగళూరు: రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలను అరికట్టడానికి ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటో చెప్పాలని రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్.ఎం కృష్ణను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు. ఈ మేరకు సాధ్యమైనంత త్వరగా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాల్సిందిగా సూచించారు. రాష్ట్రంలో గత నెల రోజులుగా రైతుల బలవన్మరణాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. చెరుకు, మల్బరీ తదితర పంటలకు సరైన మద్దతు ధర కల్పించలేకపోవడం, మార్కెట్ సదుపాయాల విషయంలో విఫలం కావడం, వ్యవసాయ రుణాలను సకాలంలో అందించకపోవడం తదితర కారణాల వల్లే రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మేల్కొన్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలు రాష్ట్ర రాజకీయాల్లో విశేష అనుభవంతోపాటు ఇక్కడ సీఎంగా పనిచేసిన ఎస్.ఎం.కృష్ణ నుంచి సలహాలు తీసుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు సన్నద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సోమవారం ఉదయం రెండు సార్లు ఎస్.ఎం.కృష్ణకు ఫోన్‌చేసి మాట్లాడారు. బలవన్మరణాలకు సంబంధించిన కారణాలు, పరిహారం తదితర విషయాలపై ఆరా తీశారు. వ్యవసాయ రంగం విషయంలో సిద్ధరామయ్య ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యవైఖరే సమస్యకు ప్రధాన కారణమని ఎస్.ఎం. కృష్ణ పేర్కొన్నట్లు తెలిసింది.
మృతుల కుటుంబాలను పరామర్శించే విషయంలో కూడా సిద్ధరామయ్యతోపాటు ఇతర మంత్రులు నిర్లక్ష్యధోరణితో వ్యవహరించడం వల్లే విపక్షాలతో పాటు ప్రజల నుంచి తీవ్రంగా విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తోందని ఆయన తెలిపారు. దీంతో ‘రైతుల బలవన్మరణాల’ విషయమై ప్రభుత్వంతోపాటు పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలపై సూచనలతో పాటు ఇప్పటి వరకూ చోటుచేసుకున్న విషయాలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా సోనియాగాంధీ సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి మృతుల కుటుంబాలను పరామర్శించాల్సిందిగా ఆమె కేంద్ర మాజీ మంత్రి ఎస్.ఎం.కృష్ణను ఆదేశించారు.