రాష్ట్రాల్లోనూ ‘భూ’పోరు
రైతుకు నష్టం చేసే అభివృద్ధిని అడ్డుకుంటాం: కాంగ్రెస్
* ఆర్డినెన్స్‌తో రైతుల భూములు లాక్కునే యత్నంలో మోదీ ప్రభుత్వం ఓడిపోయింది
* రాష్ట్రాల్లో భూ బిల్లు అమలు ప్రయత్నాలను అడ్డుకుంటాం: సోనియా
* మోదీది ‘మేక్ ఇన్ ఇండియా’ కాదు.. ‘టేక్ ఇన్ ఇండియా’: రాహుల్
* కిసాన్ సమ్మాన్ సభలో ఎన్‌డీఏ సర్కారుపై కాంగ్రెస్ నేతల ధ్వజం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు కొత్త భూసేకరణ బిల్లుతో రైతుల భూములను లాక్కునే ప్రయత్నానికి వ్యతిరేకంగా లోక్‌సభ, రాజ్యసభల్లో చేసిన పోరాటాన్ని అసెంబ్లీల్లోనూ కొనసాగిస్తామని..
రాష్ట్రాల్లోనూ ఉద్యమిస్తామని విపక్ష కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. రైతులకు నష్టం చేసే ఎలాంటి అభివృద్ధినైనా అడ్డుకుంటామంది. పారిశ్రామికవేత్తల కోసమే ‘మేక్ ఇన్ ఇండియా’ అంటున్నారని.. అందులో రైతులు, కార్మికులకు చోటులేదని విమర్శించింది. ప్రధాని మోదీది ‘టేక్ ఇన్ ఇండియా’ విధానమని ఆరోపించింది. కాంగ్రెస్ ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో కిసాన్ సమ్మాన్ పేరుతో బహిరంగ సభ నిర్వహించింది.
ఈ సభలో పార్టీ చీఫ్ సోనియాగాంధీ మాట్లాడుతూ.. భూసేకరణ చట్టం-2013కు సవరణలు చేసేందుకు మోదీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ఎన్‌డీఏ మినహా అన్ని పార్టీలూ వ్యతిరేకించడంతో కేంద్రం వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఆర్డినెన్సు ద్వారా భూమి లాక్కునే ప్రయత్నంలో మోదీ ప్రభుత్వం ఓటమి చవిచూసిందంటూ.. ఇది అందరి విజయమని అభివర్ణించారు. ఎండ, వాన, చలి, వేడిని తట్టుకుని రాత్రింబవళ్లు పనిచేస్తూ రక్తస్వేదాలు చిందిస్తున్న రైతులు కేవలం అన్నదాతలు మాత్రమే కాదని, భాగ్యవిధాతలు కూడా అని అన్నారు.
రైతుల పోరాటం ముగియలేదని, ఉద్యమ మైదానం ఢిల్లీ నుంచి రాష్ట్రాల్లోకి వెళ్లిందని చెప్పారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో రైతుల పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయన్నారు. తమ హయాంలో రుణమాఫీ చేశామని, కానీ మోదీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తల కోసం రూ. 40 వేల కోట్లు పన్ను రాయితీ కల్పించిందన్నారు. ప్రధాని ఉత్సాహమంతా పారిశ్రామికవేత్తల కోసం, విదేశీ యాత్రలకు డబ్బు ఖర్చుచేయడంపైనే ఉందని అన్నారు. తన తప్పిదాలను కప్పిపుచ్చడానికి కాంగ్రెస్‌ను దోషిగా చేస్తున్నారని దుయ్యబట్టారు.
అభివృద్ధికి కాంగ్రెస్ అవరోధంగా మారిందని మోదీ విమర్శిస్తుంటే ఆయనపై జాలి కలుగుతోందని పేర్కొన్నారు.. ‘స్వాతంత్య్ర పోరాటం జరిగినప్పుడు మీ పార్టీ ఎక్కడ ఉంది? ప్రాణత్యాగాలు చేసి దేశానికి స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ అభివృద్ధిని అడ్డుకుంటుందా?’’ అని ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకున్నా.. కరువు ఎదుర్కొంటున్న రైతుల భారాన్ని దేవుడికి వదిలేసినా.. గిరిజన భూములను పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టినా, అభివృద్ధి అర్థం పారిశ్రామికవేత్తల కోసమే అయితే.. దానికి కాంగ్రెస్ అడ్డంకి అవుతుందని సోనియా స్పష్టం చేశారు.
‘అలాంటి మేక్ ఇన్ ఇండియా అక్కర్లేదు’
‘‘మేక్ ఇన్ ఇండియాలో కార్మికులు, రైతులకు స్థానంలేదు. మోదీని కలసి, మాట్లాడేవారికి అందులో చోటు ఉంది. ఇలాంటి మేక్ ఇన్ ఇండియా దేశానికి అవసరం లేదు’’ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. ‘‘మేక్ ఇన్ ఇండియా’ కాదు.. మోదీది ‘టేక్ ఇన్ ఇండియా’ విధానం. ఓ వైపు భూమిని, మరోవైపు హక్కులు లాక్కుంటున్నారు. మోదీకి సన్నిహితంగా ఉండే ఒకరిద్దరు మిత్రులకు లాభం తప్పితే చివరకు రైతులకు ఏమీ మిగలదు’’ అని ధ్వజమెత్తారు.
మూడు సార్లు ఆర్డినెన్సు తెచ్చిన మోదీ చివరకు దాన్ని మళ్లీ జారీ చేయబోమని ప్రకటించారంటూ.. యూపీఏ తెచ్చిన భూసేకరణ బిల్లును రద్దుచేయబోమని ప్రధాని చెప్పడం కాంగ్రెస్, రైతుల విజయంగా అభివర్ణించారు. అయితే మోదీ ఓ వైపు భూసేకరణ బిల్లును రద్దుచేయబోమంటూనే, మరోవైపు రాష్ట్రస్థాయిలో అమలు చేసుకోవాలని చెప్పారని గుర్తుచేశారు. మోదీ బిల్లును రాష్ట్రాల్లోనూ అమలు కానివ్వకుండా అడ్డుకుంటామన్నారు. తల్లిలాంటి భూమిని మోదీ లాక్కుని పారిశ్రామికవేత్తలకిస్తున్నారని రైతులు చెబుతున్నారని, రైతు భవిష్యత్ కోసం జరిగే పోరులో కాంగ్రెస్ వారి వెంట ఉంటుందని అన్నారు.