కురుపాము... అసమ్మతి బుస
కురుపాము... అసమ్మతి బుస
Published Wed, Apr 23 2014 12:58 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
సాక్షి ప్రతినిధి, విజయనగరం : టీడీపీ నేతల ప్రలోభాలకు రెబల్ అభ్యర్థులు లొంగడం లేదు. వారి బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించడం లేదు. చంద్రబాబు నమ్మక ద్రోహాన్ని ఎండగడుతున్నారు. రాయబేరానికొచ్చిన నాయకుల్ని నిలదీస్తున్నా రు. నోటికొచ్చినట్టు తిట్టి పంపించేస్తున్నా రు. అటు కురుపాంలో నిమ్మక జయరాజ్, ఇటు చీపురుపల్లిలో కెంబూరి రామ్మోహనరావు పోటీకి సై అంటున్నారు. దిగొచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేస్తున్నారు. కురుపాం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహంతో బుసలు కొడుతున్నారు. పార్టీ అభ్యర్థిని ఓడిస్తా మని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. బుజ్జగించేందుకు వెళ్లిన నాయకులకు తీవ్ర అవమానం ఎదురైంది.
ద్వారపురెడ్డి జగదీష్‌కు చేదు అనుభవం
నిమ్మక జయరాజ్‌ను బుజ్జగించేందుకు జియ్యమ్మవలస వెళ్లిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌కు చేదు అనుభవం ఎదురైంది. టీడీపీ రెబల్‌గా వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకునేలా జయరాజ్‌ను ఒప్పించేందుకొచ్చిన జగదీష్‌ను నిమ్మక వర్గీ యులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నోటికొచ్చినట్టు తిట్టి వెనక్కి పంపించేశారు. ఎమ్మెల్సీ, ఇతరత్రా ఆశలు చూపించి, రాయబే రం నడిపేందుకు చిలకలపల్లి సీతారామస్వామితో వచ్చిన జగదీష్‌కు ఊహించిన పరిణామాలు ఎదురవడంతో షాక్ తిన్నారు. జియ్య మ్మవలసలో ఓ మాజీ సర్పంచ్ ఇంట్లో జయరాజ్‌తో మంతనాలు జరిపేందుకు జగదీష్ వచ్చారని తెలుసుకుని టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. రావడమే తరువాయి జగదీష్‌ను నిలదీశారు. తమ నాయకుడికి టిక్కెట్ ఎందుకివ్వలేదని, చంద్రబాబు నమ్మ కం ద్రోహం చేశారని జగదీష్‌ను చుట్టుముట్టేసి ప్రశ్నించారు. నోటికొచ్చినట్టు, దారుణంగా దుర్బాషలాడారు. ఒకానొక సందర్భంలో పైన పడిపోయేలా దూసుకొచ్చారు. అనివార్య కారణాల వల్ల థాట్రాజ్‌కు టిక్కెట్ ఇచ్చారని సమర్ధించుకునేందుకు ప్రయత్నించినా ని మ్మక అనుచరులు వెనక్కి తగ్గలేదు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఇక, చేసే దేమి లేక జగదీష్ చేదు అనుభవంతో వెనుతిరిగారు.
సంధ్యారాణి, థాట్రాజ్‌కు ఇదే పరిస్థితి
కొమరాడలో జగదీష్‌తో పాటు ఎన్నికల ప్రచారానికొచ్చిన టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి, అసెంబ్లీ అభ్యర్థి వి. టి. జనార్దన్ థాట్రాజ్‌కు అదే పరిస్థితి ఎదురైంది. ప్రచారసభ జరుగుతుండగా టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా లేచి జయరాజ్‌కు టిక్కెట్ ఎందుకివ్వలేదని నిలదీశారు. 20 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న జయరాజ్‌కు చంద్రబాబు ద్రోహం చేశారని, నిజమైన గిరిజ నుడికి అన్యాయం చేశారని మండిపడ్డారు. దీంతో ఆ ముగ్గురు నేతలు కంగుతిన్నారు. నిరాశతో వెనుతిరిగారు.
తలొగ్గని కెంబూరి
చీపురుపల్లిలో టీడీపీ రెబెల్‌గా నామినేషన్ వేసిన కెంబూరి రామ్మోహనరావును ఎంత బుజ్జగించినా వెనక్కి తగ్గలేదు. ప్రలోభా లకు గురిచేసినా ససేమిరా అంటూ తిరస్కరించారు. చంద్రబాబు తీరుపై తీవ్ర ఆవేదనతో ఉన్నారు. దీంతో కుటుంబపరంగా ఒత్తిడి తీసుకొచ్చి ఒప్పించే ప్రయత్నానికి దిగారు. కానీ కెంబూరి అనుచరులు ఎట్టి పరిస్థితుల్లో రాజీపడొద్దని ఒత్తిడి చేస్తున్నారు.
టీడీపీ నన్ను మోసం చేసింది
ఆ పార్టీ రెబల్ అభ్యర్థి జయరాజ్
గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌లైన్: నియోజకవర్గంలో 20 ఏళ్ల పాటు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన తనకు పార్టీ అధినేత టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని టీడీపీ రెబల్ అభ్యర్థి నిమ్మక జయరాజ్ అన్నారు. పార్టీలో నైతిక విలువలు లేవన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితో దొంగల పార్టీగా మారిపోయిందన్నారు. మంగళవారం రాత్రి ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. రాయబారుల మాట విని అనాలోచిత నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ప్రజాగ్రహాన్ని చవిచూడకతప్పదని హెచ్చరించారు. చినమేరంగి రాజులు విభజించు, పాలించు అన్న పద్ధతిలో గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారన్నారు. నేరుగా ఎన్నికల బరిలో ఎదుర్కొలేకనే తనపై కుట్రలు పన్నారని ఆరోపించారు. ఆర్థిక బలంలేని తనకు డబ్బులిచ్చి లొంగదీసుకోవాలని చూస్తే లొంగేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే కొంతమంది ప్రత్యర్థులు తనకు డబ్బులిచ్చామని పోటీ నుంచి తప్పుకుంటారని ప్రచారం చేస్తున్నారన్నారు. ఆయనతో పాటు తాడంగి కేశవరావు, పాడి సుదర్శనరావు ఉన్నారు.
Advertisement
Advertisement