టీడీపీ గూండాల వీరంగం
వైఎస్‌ఆర్ సీపీ, కాంగ్రెస్ నేతల ఇళ్లలోకి చొరబడి దాడులు
బీభత్సం సృష్టించిన తెలుగుతమ్ముళ్లు ఉన్మాదంగా మారిన ఆనందం
తమ నేతకు టిక్కెట్ కేటాయించారని సంబరాలు జరుపుకొంటూ రెచ్చిపోయిన వైనం
పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నాకు దిగిన వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ శ్రేణులు
గంట్యాడ, న్యూస్‌లైన్ : టీడీపీ నేతలు పూనకం వచ్చిన వారిలా రెచ్చిపోయారు. అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. ఉన్మాదుల్లా ప్రవర్తించారు. ఇళ్లలోకి చొరబడి కనిపించినవారినల్లా విచక్షణా రహితంగా చావ బాదారు. వేడుకుంటున్నా కనికరించకుండా పశుబలం ప్రదర్శించారు. దీంతో గంట్యాడలో ఆదివారం అర్ధరాత్రి హాహాకారాలు మిన్నంటాయి. ఎవరు చొరబడ్డారో...ఎందుకు కొడుతున్నారో తెలియక స్థానికులు తీవ్రంగా భీతిల్లారు. తరువాత అసలు విషయం తెలిసిన వైఎస్‌ఆర్ సీపీ, కాంగ్రెస్ నేతలు పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో గంట్యాడ జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్‌ఆర్ సీపీ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో అప్పటి నుంచి ఆక్రోశంతో ఉన్న టీడీపీ నేతలు రాజకీయంగా వైఎస్‌ఆర్ సీపీ నేతలపై కక్ష పెంచుకున్నారు.
దీనికి తోడు టీడీపీ, బీజేపీపొత్తులో భాగంగా గజపతినగరం అసెంబ్లీ టిక్కెట్‌ను బీజేపీకి కేటాయిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో మరింత క్షోభకు గురైన అక్కడి నేతలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అయితే గజపతినగరం టిక్కెట్‌ను టీడీపీకే ఖరారు చేస్తూ కె.ఎ.నాయుడికి కేటాయిస్తున్నట్టు ఆదివారం రాత్రి సమాచారం అందింది. దీంతో స్థానిక టీడీపీ నేతలు బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకొన్నారు. ఆ ఆనందం కాస్తా ఉన్మాదంగా మారిపోయింది. పాతకక్షలు దృష్టిలో పెట్టుకొని మొదట కాంగ్రెస్ పార్టీకి చెందిన కొండపల్లి వెంకటరమణ ఇంట్లోకి చొరబడి దాడి చేశారు. తరువాత పూర్తిగా రెచ్చిపోయిన వారు వైఎస్‌ఆర్ సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతల ఇళ్లలో చొరబడి బీభత్సం సృష్టించారు. ఇళ్లల్లో ఉన్న వారిని విచక్షణారహితంగా కొడుతూ.. పరుగులు పెట్టించారు.
అనంతరం ఆ రెండు పార్టీలకు చెందిన వారు కుటుంబాలతో పాటు పోలీస్ స్టేషన్ వెళ్లి అక్కడ పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. దాడులకు పాల్పడిన వారిని టీడీపీ అభ్యర్థిగా భావిస్తున్న కె.ఎ.నాయుడు సోదరుడు, మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు ఇంట్లో దాచారని, వారిపై చర్యలు తీ సుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతలో అక్కడకు చేరుకున్న గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్యతో పాటు సీఐ గోవిందరావు, ఎస్‌ఐ షేక్ షరీఫ్ ఆందోళనకారులను శాంతింపజేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ విషయమై ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య విలేకరులతో మాట్లాడుతూ టిక్కెట్ వచ్చినందుకే టీడీపీ కార్యకర్తలు ఇలా ప్రవరిస్తే.. మున్ముందు వారి తీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునన్నారు. కాగా దాడులు చేసిన టీడీపీ కార్యకర్తలు సుంకర తాతబాబు, నడుపూరి సురేష్,గొర్ల రమణ,ఎజ్జాడ శ్రీను,కునుకుశ్రీను,రఘుమండలక్ష్మి,బూడినరేష్‌లను అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత కొండపల్లి వెంకటరమణ గంట్యాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.