
సహకారానికి నో
నామినేషన్ల ఉపసంహరణతో రెబెల్స్ బెడద తప్పిందని ఊపిరి పీల్చుకున్న టీడీపీ అభ్యర్థులకు ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడింది. సొంత పార్టీ నేతలే సహకరించకపోవడం మరింత తలనొప్పిగా మారింది. పగలంతా తమ వెంట ప్రచారంలో పాల్గొంటున్న వారే తమ ఓటమికి తెరవెనుక పావులు కదుపుతున్నారని అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. పొత్తు పెట్టుకున్న మిత్రపక్షం బీజేపీతోనూ సఖ్యత లేక, ఇరు పక్షాల ఓట్ల బదిలీ ప్రశ్నార్థకమైంది. టీడీపీ పోటీలో ఉన్న చోట కమలదళం అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తుంటే.. బీజేపీ అభ్యర్థి ప్రచారంలో తెలుగు తమ్ముళ్ల జాడే కరువైంది.
సాక్షి, గుంటూరు :సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటనతో జిల్లా టీడీపీలో ఆరంభమైన అసమ్మతి సెగలు ఏదో ఒక రూపంలో ఎగసిపడుతూనే ఉన్నాయి. అభ్యర్థుల విజయావకాశాలకు సొంతపార్టీ నేతలే ప్రతిబంధకంగా మారుతున్నారని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. టికెట్ల కేటాయింపులో పార్టీ అధినేత చంద్రబాబు పొరపాట్లు చేశారంటూ ఆగ్రహించిన ఆశావహులు సహాయ నిరాకరణ చేస్తున్నారు. నరసరావుపేటను పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతోపాటు సత్తెనపల్లి, మంగళగిరి, మాచర్ల, గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గాలకు టికెట్ల కేటాయింపు సరిగా లేదంటూ తెలుగుతమ్ముళ్లు భగ్గుమన్న విషయం తెలిసిందే. అభ్యర్థుల ఎంపికపై నిరసన వ్యక్తం చేస్తూ ఆయా నియోజకవర్గాల నుంచి అనేకమంది రెబల్ అభ్యర్థులుగా నామినేషన్లు కూడా దాఖలు చేశారు. పార్టీ అధిష్టానం, జిల్లా నాయకుల హామీలు, తాయిలాలు, ఒత్తిడితో ఎట్టకేలకు వారు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో టీడీపీ, బీజేపీ అభ్యర్థులు ఊపిరిపీల్చుకున్నారు.
అసమ్మతికి ముఖ్య నేతల ప్రోత్సాహం..
రెబెల్స్ బెడద తీరింది. ఇక వారు తమకు సహకరిస్తారని భావించిన అభ్యర్థులకు ప్రస్తుత పరిణామాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పగలంతా తమవెంటే తిరుగుతూ ప్రచారంలో పాల్గొంటున్న కొందరు సొంత పార్టీ నాయకులే రాత్రయ్యేసరికి తమ ఆంతరంగికులతో సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఇతను ఇక్కడ గెలిస్తే తిరిగి పదేళ్ల వరకు మాకు అవకాశం ఉండదు కాబట్టి ఎలా ఓడించాలా అని పథక రచనలు చేస్తున్నారని తెలిసి ఏం చేయాలో పాలుపోక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ఇంకొందరైతే ఏకంగా ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలిపి రోజూ ఇక్కడి సమాచారమంతా ఆ శిబిరానికి చేరవేస్తూ పార్టీని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారంటూ అభ్యర్థులు వాపోతున్నారు. అసమ్మతి నేతలకు జిల్లా టీడీపీ ముఖ్య నాయకుల మద్దతు ఉందని తెలుసుకుని తమ భవిష్యత్తు తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. ముఖ్యంగా గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డికి ఆ పార్టీలోని సొంత సామాజిక వర్గ నాయకులే సహకరించడం లేదని ఆరోపణలు వినవస్తున్నాయి. వీటన్నిటిపై త్వరలో జిల్లాకు రానున్న అధినేత ముందు పంచాయితీ పెట్టేందుకు కొందరు అభ్యర్థులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
కోడెల ప్రచారానికి నరసరావుపేట నేతలు..
నరసరావుపేట స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో అక్కడి టీడీపీ ముఖ్య నేతలంతా కోడెల వెంట సత్తెనపల్లిలో ప్రచారానికి వెళ్తూ నరసరావుపేట గురించి పట్టించుకోవడం లేదని బీజేపీ అభ్యర్థి నలబోతు వర్గీయులు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా సత్తెనపల్లిలో సీటు ఆశించి భంగపడిన అక్కడి టీడీపీ ఇన్‌చార్జి నిమ్మకాయల రాజనారాయణ, అదే నియోజకవర్గానికి చెందిన తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు మల్లేశ్వరరావు వర్గీయులు తమకు సహకరించడం లేదని కోడెల వర్గీయులు ఆరోపిస్తున్నారు. మాచర్లలో సైతం అసమ్మతి నేతలెవరూ మనస్ఫూర్తిగా సహకరించడం లేదని టీడీపీ అభ్యర్థి చలమారెడ్డి వర్గీయులు వాపోతున్నారు. మంగళగిరి, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని, సహకరించకపోగా సొంత పార్టీ అభ్యర్థుల ఓటమికి తెరవెనుక పావులు కదుపుతున్నారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.