ఒప్పుకోం..తప్పుకోం
పోటీ నుంచి తప్పుకోని తిరుగుబాటు నేతలు.. అన్ని పార్టీల్లో రెబెల్స్ గుబులు
అధినాయకుల హెచ్చరికలు బేఖాతర్ కేసీఆర్, పొన్నాల, ఎర్రబెల్లి వంటి ముఖ్యులకూ ముప్పే
బెడిసికొడుతున్న టీడీపీ-బీజేపీ పొత్తు మిత్రపక్షం సీపీఐకి కాంగ్రెస్ షాక్, మహేశ్వరంలో అధికారిక అభ్యర్థి
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. పార్టీల్లో గుబులు రేపిన రెబెల్స్ మాత్రం వెనక్కి తగ్గలేదు. నాయకుల విన్నపాలు, తాయిలాలు, హెచ్చరికలతో కొందరు తప్పుకొన్నా.. చాలా మంది తిరుగుబాటు నేతలు పోటీలోనే ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు తలొగ్గలేదు. దీంతో అన్ని పార్టీలకు తలనొప్పి తప్పడం లేదు. ఏదో పంతానికి పోయి ప్రజల్లో పెద్దగా పట్టు లేకపోయినా బరిలో నిలిచిన వారు కొందరు కాగా, గెలుపోటములను ప్రభావితం చేయగలిగిన వారే ఎక్కువగా ఉండటంతో అనేక స్థానాల్లో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. ఈసారి ప్రధాన పార్టీలన్నీ రెబెల్స్ ముప్పును ఎదుర్కొంటున్నాయి.
అసలే కాంగ్రెస్-సీపీఐ పొత్తు ఆది నుంచీ అయోమయంగా మారగా, ఇప్పుడు రెబెల్స్ వల్ల ఆ పొత్తే నామమాత్రమైంది. సీపీఐకి కేటాయించిన ఏడు సీట్లలో మూడింటిలో కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరికి పార్టీ పెద్దలే సహకరిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇక టీడీపీ-బీజేపీ పొత్తు వ్యవహారం కూడా గందరగోళంగా మారింది. కమలానికి కేటాయించిన సీట్లలో టీడీపీ, తమ్ముళ్లకు వదిలిన సీట్లలో బీజేపీ నేతలు పోటీ పడుతున్నారు. కీలక స్థానాల్లో ఈ పార్టీల మధ్య దోస్తీ చెడినట్లే కనిపిస్తోంది. ఖవ్ముం జిల్లాలోనైతే బీజేపీ బాహాటంగానే టీడీపీకి కటీఫ్ చెప్పబోతున్నట్లు సమాచారం. ఇక ముఖ్య నేతలు పోటీ చేస్తున్న చోట తిరుగుబాటు నేతల విషయం రసవత్తరంగా మారింది. జనగాంలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు, మెదక్ పార్లమెంట్, గజ్వేల్ అసెంబ్లీకి పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు, పాలకుర్తి నియోజకవర్గంలో దేశం నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుకూ రెబెల్స్ బెడద తప్పలేదు.
జిల్లాలవారీగా రెబెల్స్‌ను పరిశీలిస్తే...
వరంగల్: టీ-పీసీసీ చీఫ్‌కు సొంత ఇలాకాలోనే రెబెల్ బెడద తప్పలేదు. పొన్నాల పోటీ చేస్తున్న జనగాం అసెంబ్లీ స్థానం నుంచి పీసీసీ కార్యదర్శి బక్క జడ్సన్ రంగంలో ఉన్నారు. ఈయనను బరిలో నుంచి తప్పించే ప్రయత్నాలు విఫలమయ్యాయి. జనగాం స్థానంలో మొత్తం 19 మంది పోటీకి దిగారు. వీరిలో 8 మంది ఇండిపెండెంట్‌లే. ఇక నర్సంపేట స్థానాన్ని మొదట తనకు కేటాయించి తర్వాత.. జేఏసీ నేత కత్తి వెంకటస్వామి పేరును ప్రకటించడంపై ఆగ్రహానికి గురైన డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేసి స్వతంత్రంగా పోటీకి దిగారు. పాలకుర్తిలో కాంగ్రెస్ రెబెల్ లక్ష్మీనారాయణ నాయక్ బరిలో ఉన్నారు. ఈయన సతీమణి ధన్వంతి.. పీసీసీ క్రమశిక్షణా సంఘం సభ్యురాలిగా ఉండటం గమనార్హం. ఇక్కడ టీడీపీ నేత దయాకర్‌రావుకు పోటీగా సొంత పార్టీ నేత ఎర్రబెల్లి రాఘవరావు సై అంటే సై అంటున్నారు.
కరీంనగర్: మంథనిలో టీఆర్‌ఎస్ రెబెల్ సుధీర్ రెడ్డి బరిలో నిలిచారు. రామగుండంలో టీఆర్‌ఎస్ రెబెల్ కూరకంటి చందర్, కాంగ్రెస్ రెబెల్ కౌశిక్ హరి, కోరుట్ల నియోజకవర్గంలో జువ్వాడి రత్నాకర్‌రావు కొడుకు జువ్వాడి నర్సింగరావు కాంగ్రెస్ రెబెల్‌గా పోటీలో ఉన్నారు.
ఖమ్మం: జిల్లాలో టీడీపీ-బీజేపీ పొత్తుకు బ్రేక్ పడింది. టీడీపీతో కటీఫ్ అని జిల్లా బీజేపీ ఆదివారం అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఇందుకోసం జిల్లా నేతలు సమావేశమం ఏర్పాటు చేసుకుంటున్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి పినపాక నియోజకవర్గం దక్కింది. అయితే అక్కడ టీడీపీ నుంచి పాయం నర్సింహారావు పోటీలో ఉన్నారు. ఇది కమలనాథులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో టీడీపీకి సహకరించేది లేదని జిల్లా బీజేపీ నేతలు తేల్చి చెబుతున్నారు. ఇక కేంద్ర మంత్రి బలరాం నాయక్‌కు రెబెల్ బెడద తప్పినప్పటికీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోనున్నారు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యలను ఓడించాలంటూ లంబాడీ, కోయ సామాజిక వర్గాలు ఏకంగా ఓ సమన్వయ కమిటీని వేసుకున్నాయి. ఆ ఇద్దరికీ వ్యతిరేకంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాయి.
నల్గొండ: సీపీఐకి కేటాయించిన మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు స్రవంతి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. బీజేపీ-టీడీపీ పొత్తుకూ జిల్లాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. పొత్తులో భాగంగా సూర్యాపేటను టీడీపీకి కేటాయించారు. ఇక్కడ బీజేపీ రెబెల్ సంకినేని వెంకటేశ్వరరావు బరిలో నిలిచారు. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీకి దక్కగా.. ఇక్కడ టీడీపీ రెబెల్ కంచర్ల భూపాల్ రెడ్డి సై అంటున్నారు.
మహబూబ్‌నగర్: టీడీపీకి కేటాయించిన నారాయణపేటలో.. బీజేపీ నేత రతన్‌పాండ్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి స్వతంత్రంగా బరిలో నిలిచారు. మహబూబ్‌నగర్ అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడంతో టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌కు వెళ్లిన ఇబ్రహీంకు అక్కడా నిరాశే మిగలడంతో ఆయన మహబూబ్‌నగర్ పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు స్వతంత్రంగా బరిలో ఉన్నారు.
మెదక్: మెదక్ పార్లమెంటుతో పాటు గజ్వేల్ అసెంబ్లీలోనూ కేసీఆర్‌కు రెబెల్ బెడద తప్పలేదు. మెదక్ పార్లమెంటు పరిధిలో కేసీఆర్ మీద ఆ పార్టీ నేత బీరయ్య యాదవ్ పోటీలో ఉన్నారు. ఇక గజ్వేల్ అసెంబ్లీ బరిలో రెబెల్ కేశిరెడ్డి లింగారెడ్డి బరిలో నిలిచారు. పటాన్‌చెరువులో టీడీపీ అభ్యర్థికి బీజేపీ నేత అంజిరెడ్డి రూపంలో ముప్పు పొంచి ఉంది.
నిజామాబాద్: జుక్కల్‌లో కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణతార రెబెల్‌గా తిరుగుబాటు చేశారు. ఇదే నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పండరీ కూడా టీఆర్‌ఎస్ రెబెల్‌గా బరిలో ఉన్నారు. బోధన్‌లో టీడీపీ రెబెల్ అమర్‌నాథ్ బాబు పోటీలో నిలిచారు.
రంగారెడ్డి: మేడ్చల్‌లో టీడీపీ ఇన్‌చార్జ్ నక్క ప్రభాకర్‌గౌడ్ స్వతంత్రంగా పోటీకి దిగారు. ఇక్కడ జంగయ్య యాదవ్‌కు టీడీపీ టికెట్ లభించింది. మహేశ్వరంలో మల్‌రెడ్డి రంగారెడ్డికి షరతులతో కూడిన బీఫారం ఇచ్చామని, ఆయన్ని వైదొలగాలని ఆదేశించామని చెప్పుకొచ్చిన కాంగ్రెస్.. చివరకు ఆయన్ని బరి నుంచి తప్పించలేకపోయింది. దీంతో ఇక్కడ సీపీఐకి తలనొప్పి తప్పలేదు.
హైదరాబాద్: గోషామహల్‌లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌కు సొంత పార్టీ నేత నందకిషోర్ వ్యాస్ రెబెల్‌గా మారారు.