రెండోసారి గెలిచిన రికార్డు | Record second win | Sakshi
Sakshi News home page

రెండోసారి గెలిచిన రికార్డు

Published Fri, Apr 4 2014 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 5:32 AM

Record second win

మాచర్లటౌన్, న్యూస్‌లైన్ :చర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. 1952 నుంచి 55 వరకు గురజాల, మాచర్ల ఒకే నియోజకవర్గంలో ఉండేవి. అప్పట్లో కోలా సుబ్బారెడ్డి ఉమ్మడి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1955లో మాచర్ల నియోజకవర్గం ఏర్పడింది. ఆ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి మందపాటి నాగిరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత 1962లో కాంగ్రెస్ అభ్యర్థి కేశవనాయక్ సీపీఐ అభ్యర్థి రంగమ్మరెడ్డిపై విజయం సాధించారు. 1967లో వెన్నా లింగారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థి జూలకంటి నాగిరెడ్డిపై 76 ఓట్లతో గెలుపొందారు. 1972లో స్వతంత్ర అభ్యర్థి జూలకంటి నాగిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి వెన్నా లింగారెడ్డిపై  12,400 ఓట్లతో గెలుపొందారు. 1978లో చల్లా నారపరెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి జనతా పార్టీ అభ్యర్థి కర్పూరపు కోటయ్యపై 6 వేల ఓట్లతో గెలుపొందారు. 1983లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన కొర్రపాటి సుబ్బారావు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా నారపరెడ్డిపై 22,400 ఓట్లతో గెలుపొందారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నట్టువ కృష్ణమూర్తి  టీడీపీ అభ్యర్థి ఒట్టికొండ జయరామయ్యపై 1700 ఓట్లతో గెలుపొందారు. 1989లో టీడీపీ అభ్యర్థి నిమ్మగడ్డ శివరామకృష్ణప్రసాద్  కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణమూర్తిపై 4,400 ఓట్లతో గెలుపొందారు.
 
1994లో టీడీపీ అభ్యర్థి కుర్రి పున్నారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పిన్నెల్లి సుందరరామిరెడ్డిపై 6,575 ఓట్లతో గెలుపొందారు. 1999లో టీడీపీ తరపున పోటీచేసిన జూలకంటి దుర్గాంబ కాంగ్రెస్ అభ్యర్థి పిన్నెల్లి లక్ష్మారెడ్డిపై 1500 ఓట్లతో విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పిన్నెల్లి లక్ష్మారెడ్డి టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిపై 32,200 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో ఇదే అత్యధిక మెజార్టీ. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి పై 9,640 ఓట్లతో విజయం సాధించారు. 2012లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి చిరుమామిళ్ల మధుబాబుపై 15,400 ఓట్లతో విజయం సాధించి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో రికార్డు సృష్టించారు.ఈ  ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీచేసిన గుంటూరుకు చెందిన మాగంటి సుధాకర్‌యాదవ్  కేవలం 16 వేల ఓట్లను పొంది డిపాజిట్‌ను కోల్పోయారు. 
 
టీడీపీలో తెరపైకి రోజుకో పేరు
మరో తొమ్మిది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలవుతున్నా టీడీపీ ఇంతవరకు తన అభ్యర్థిని నిర్ణయించుకోలేకపోతోంది. ఆ పార్టీ తరఫున రోజుకో పేరు తెరపైకి వస్తోంది. టీడీపీ టిక్కెట్ కోసం 2009 ఎన్నికల్లో టిక్కెట్ పొంది చివరి నిముషంలో చేజార్చుకున్న కొమ్మారెడ్డి చలమారెడ్డి ఈసారి టిక్కెట్ తనదేనని ధీమాగా ఉన్నారు. 2012 ఉప ఎన్నికల్లో  ఓడిపోయిన చిరుమామిళ్ళ మధుబాబు ప్రస్తుతం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తుండడంతో టిక్కెట్ తనకే దక్కుతుందన్న ఆశలో ఉన్నారు. గతంలో రెండుసార్లు పోటీచేసి ఓడిపోయిన జూలకంటి బ్రహ్మారెడ్డి  తన ప్రయత్నాల్లో తాను ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఆయన సోదరుడు, ఎన్‌ఆర్‌ఐ శ్రీనివాసరెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. వీరితో పాటు నిన్నమొన్నటి వరకు గురజాలలో వైఎస్సార్‌సీపీలో పనిచేసి, ఇటీవలే పార్టీలో చేరిన యెనుముల మురళీధరరెడ్డి మాచర్ల టీడీపీ టిక్కెట్ కోసం  ప్రయత్నిస్తున్నారు. టీడీపీలో చేరకుండానే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి రాయపాటి సాంబశివరావు ద్వారా  టిక్కెట్ కోసం యత్నిస్తున్నారు. ఇదిలావుండగా ఎస్పీఎఫ్ డీఐజీగా పనిచేస్తున్న చంద్రగిరి ఏసురత్నం కుటుంబం కూడా గత రెండురోజులుగా హైదరాబాద్‌లో మకాం వేసి బీసీ నాయకులతో కలసి టిక్కెట్ కోసం చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.
 
ఇప్పటివరకు గెలిచిన 
శాసనసభ్యులు
1952 - కోలా సుబ్బారెడ్డి
1955 - మందపాటి నాగిరెడ్డి
1962 - కేశవనాయక్
1967 - వెన్నా లింగారెడ్డి
1972 - జూలకంటి నాగిరెడ్డి
1978 - చల్లా నారపరెడ్డి
1983 - కొర్రపాటి సుబ్బారావు
1985 - నట్టువ కృష్ణ
1989 - నిమ్మగడ్డ శివరామకృష్ణప్రసాద్
1994 - కుర్రి పున్నారెడ్డి
1999 - జూలకంటి దుర్గాంబ
2004 - పిన్నెల్లి లక్ష్మారెడ్డి
2009 - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
2012 - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(ఉప ఎన్నిక)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement