పాలకుర్తి బరిలో శ్రీరాంరెడ్డి
పాలకుర్తి, న్యూస్‌లైన్: ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్‌ఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగాల శ్రీరాంరెడ్డి... వరంగల్ జిల్లా పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాది పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. వరంగల్ జిల్లా లింగాలఘణపురానికి చెందిన శ్రీరాంరెడ్డి 1989 నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోవడంతో ఆయన సమాజ్‌వాది పార్టీ తరపున నామినేషన్ వేశారు. శ్రీరాంరెడ్డి తండ్రి లింగాల చెన్నకృష్ణారెడ్డి దాతృత్వ కార్యక్రమాల ద్వారా స్థానికంగా సుపరిచితులు.
వారసత్వంగా వచ్చిన భూములను రఘునాథపల్లి, జనగామ, లింగాలఘణపురం మండలాల్లో పేదలకు పంచిపెట్టారు. తండ్రిలా శ్రీరాంరెడ్డి కూడా కమ్యూనిటీ, పాఠశాల భవనాలకు, బాలవికాస స్వచ్ఛంద సంస్థలకు, గ్రామ పంచాయతీ భవనాలకు సొంత భూములను విరాళంగా గతంలో అందజేశారు. కాగా, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని లింగాల శ్రీరాంరెడ్డి చెప్పారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.
మిజోరంలోని ఏకైక లోక్‌సభ స్థానానికి శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 9నే జరగాల్సిన ఎన్నికలు.. బ్రూ తెగ శరణార్థులకు త్రిపురలో ఓటేసేందుకు అనుమతించడంపై ప్రజాసంఘాలు బంద్‌కు పిలుపునివ్వడంతో వాయిదా పడ్డాయి.
బీజేపీ బహిష్కృత నేత జశ్వంత్ సింగ్ తనయుడు, ఎమ్మెల్యే మానవేంద్ర సింగ్‌ను బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి తప్పించారు. ఆయన బార్మర్ లోక్‌సభ స్థాన బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మోడీ ఆరెస్సెస్‌లో పెద్ద గూండా అని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి బేణీప్రసాద్ వర్మకు ఈసీ నోటీసు జారీ చేసింది. ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, ఈ నెల 12లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.