సర్వం సిద్ధం
పాలకొండ, న్యూస్‌లైన్ : పాలకొండ అసెంబ్లీ, అరకు పార్లమెంట్ ఓట్ల లెక్కింపునకు పాలకొండ ఏఎంసీ కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తయ్యూయి. శుక్రవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. లెక్కింపు కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకుడు బల్వీందర్ సింగ్, రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో తేజ్‌భరత్‌లు గురువారం పరిశీలించారు. పాలకొండ నియోజకవర్గంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికకు మొత్తం1,68126 మంది ఓటర్లుండగా 1,20,728 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 246 పోలింగ్ స్టేషన్ల నుంచి 498 ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను నేడు లెక్కించనున్నారు. ఈ మేరకు స్థానిక ఏఎంసీ కార్యాలయ ప్రాంగణంలో మొత్తం 18 రౌండ్లలో లెక్కింపు చేయనున్నారు. ఈ కేంద్రంలో అసెంబ్లీ లెక్కింపునకు 14 టేబుల్స్, ఎంపీ ఓట్ల కోసం 14 టేబుల్స్‌ను సిద్ధం చేశారు. వీటి పర్యవేక్షణ తదితర విధుల కోసం 84 మంది ప్రత్యేక సిబ్బంది, అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రౌండ్ల వారీగా ఓట్ల ఫలితాలను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
భవిత తేలేది నేడే..!
పాలకొండ నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థులుగా విశ్వాసరాయి కళావతి (వైఎస్సార్ సీపీ), నిమ్మక సుగ్రీవులు (కాంగ్రెస్), నిమ్మక జయకృష్ణ (టీడీపీ), పత్తిక కుమార్ (సీపీఎం), కూరంగి ముఖలింగం(సీపీఐ), సవర పులిపుట్టి పెంటడు (స్వతంత్ర), బిడ్డిక వెంకయ్య (స్వతంత్ర) అభ్యర్థులు, అలాగే అరకు ఎంపీ అభ్యర్థులుగా కొత్తపల్లి గీత (వైఎస్సార్‌సీపీ), కిషోర్‌చంద్రదేవ్ (కాంగ్రెస్), గుమ్మిడి సంధ్యారాణి (టీడీపీ), మిడియం బాబూరావు (సీపీఎం)లు బరిలో ఉన్నారు. నేడు విడుదల కానున్న ఎన్నికల ఫలితాలు వీరి భవిష్యత్‌ను తేల్చనున్నాయి. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి, టీడీపీకి మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది.