
పొత్తుల చిచ్చు: బిజెపికి రాజీనామాలు
టిడిపితో పొత్తు బిజెపికి అన్నివిధాల నష్టం చేకూరుస్తోంది.
ఆదిలాబాద్: టిడిపితో పొత్తు బిజెపికి అన్నివిధాల నష్టం చేకూరుస్తోంది. ఈ పొత్తు ఆ పార్టీలో చిచ్చుపెట్టింది. తెలంగాణలో నేతలు గానీ, కార్యకర్తలు గానీ మొదటి నుంచి టిడిపితో పొత్తు వద్దని చెబుతూనే ఉన్నారు. అధిష్టానం వారి మాటలను పెడచెవిన పెట్టి పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు తెలంగాణలో బిజెపి నేతల రాజీనామాల పర్వం మొదలైంది. అక్కడ సీమాంధ్రలో పొత్తుకు విఘాతం ఏర్పడింది. తెగతెంపులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది.
టిడిపితో పొత్తు ఇష్టంలేని ఆదిలాబాద్ జిల్లా బీజేపీ నేతలు ఒకరి వెంట ఒకరు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి దుర్గం రాజేశ్వర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నివేదితవజే, గిరిజన మోర్చ రాష్ట్ర కార్యదర్శి సీడాం రామ్‌కిషన్, గిరిజన మోర్చ జిల్లా అధ్యక్షుడు గెడాం మనోహర్, యువజన మోర్చా జిల్లా కార్యదర్శి ఉదయ్‌కుమార్, మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు ఉమ రాజీనామాలు చేశారు.