
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను బాబు మోసగించారు
మతతత్వ బీజేపీతో పొత్తుపెట్టుకొని చంద్రబాబునాయుడు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీవర్గాలను ఘోరంగా మోసగించారని, తెలుగుదేశం పార్టీ వైఖరిపై ఆ వర్గాలు అప్రమత్తతతో ఉండాలని ఏపీపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి చెప్పారు.
రఘువీరారెడ్డి ధ్వజం
టీడీపీకి సీమాంధ్రలో షాక్ తప్పదు
కాంగ్రెస్‌లో చిరు అభిమానులకు చోటు
హైదరాబాద్: మతతత్వ బీజేపీతో పొత్తుపెట్టుకొని చంద్రబాబునాయుడు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీవర్గాలను ఘోరంగా మోసగించారని, తెలుగుదేశం పార్టీ వైఖరిపై ఆ వర్గాలు అప్రమత్తతతో ఉండాలని ఏపీపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి చెప్పారు. టీడీపీ మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని, వీళ్లు మనుషులేనా అన్న ఆవేదన కలుగుతోందని అన్నారు. తెలుగుదేశం పార్టీకి సీమాంధ్రలో గట్టి షాకే తగులుతుందని, తెలంగాణలో ఆ పార్టీ ఒక్క సీటూ గెల్చుకోలేదని తెలిపారు. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి మంగళవారం ఇందిరా భవన్లో తన అభిమాన సంఘాలతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో రఘువీరా మాట్లాడుతూ టీడీపీ బహిరంగంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ రహస్య సంబంధాలు కొనసాగిస్తోందని ఆరోపించారు. ఈ రెండు పార్టీలకు గుణపాఠం నేర్పాలన్నారు. చిరంజీవి అభిమానులకు పీసీసీ, డీసీసీలు, అనుబంధ సంఘాల్లో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. గెలుపు అవకాశాలున్న వారికి ఎన్నికల్లో సీట్లు ఇస్తామని చెప్పారు. నామినేషన్లలోగా రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది అభిమానులను పార్టీలో చేర్పించాలని, కాంగ్రెస్ కార్యకర్తలతో మమేకమై పనిచేయాలని కోరారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని, ఎస్సీలకు సీఎం పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేశారు. సీమాంధ్రలోని 175 స్థానాలకు 1,300 దరఖాస్తులు అందాయని, గెలిచేవారికి తప్పకుండా అవకాశం కల్పిస్తామని తెలిపారు. 70 శాతం స్థానాల్లో కొత్తవారికి ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. యువత, బీసీ, మహిళలకు ఎక్కువ అవకాశాలుంటాయన్నారు.
సీఎంలు, మంత్రులు పార్టీని వీడినా కాంగ్రెస్‌కు నష్టం లేదన్నారు. చిరంజీవి మాట్లాడుతూ కాంగ్రెస్‌ను పటిష్టం చేసి, విజయపథంలో నడిపించేందుకు అభిమానులంతా కృషి చేయాలని కోరారు. బీజేపీ ప్రజలను వంచిస్తోందని, మోడీ ప్రచారాలకోసం ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో ఏ నాయకులు ఎటు పోతున్నారో అర్థం కావడంలేదని, పార్టీల మధ్య అక్రమసంబంధాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఈ సందర్భంగా పార్టీ రూపొందించిన ప్రచార సీడీని చిరంజీవి ఆవిష్కరించారు.
కిరణ్ గోముఖ వ్యాఘ్రం : ఆనం
కాంగ్రెస్ పార్టీని మోసగించి కొత్త పార్టీని పెట్టిన కిరణ్‌కుమార్ రెడ్డి గోముఖ వ్యాఘ్రమని ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. చిరంజీవి అభిమానులతో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చివరివరకు పార్టీలో ఉన్నత స్థానాల్లో కొనసాగి చివరకు పార్టీని వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తి తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తామంటే తాము అంగీకరించబోమన్నారు. ఈనెల 11, 12 తేదీల్లో పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తామని చెప్పారు. 12 లేదా 13న మేనిఫెస్టోను విడుదల చేస్తామని తెలిపారు.