
రాజ్యాంగ సంస్థలపై విమర్శలు సరికాదు
* ఓటమికి కారణాలు వెతుక్కుంటూ ఇలా మాట్లాడటం తగదు
* రాష్ట్రంలో పోలింగ్ స్వేచ్ఛగా, ప్రశాంతంగా ముగిసింది
* చిన్న సంఘటనలను మొత్తానికి ఆపాదించడం సరికాదు
* ఎన్నికల నిఘా వేదిక ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: ఓటమికి కారణాలు వెతుక్కునే చర్యల్లో భాగంగా రాజ్యాంగ సంస్థలపై బురదచల్లడం ఏమాత్రం మంచిది కాదని టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఎన్నికల నిఘా వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ ప్రతినిధులు వ్యాఖ్యానించా రు. రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించినందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) భన్వర్‌లాల్‌ను ఎన్నికల నిఘా వేదిక ప్రతినిధులు ప్రశంసించారు. వేదిక ప్రతి నిధులు జస్టిస్ అంబటి లక్ష్మణరావు, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, వి.లక్ష్మణరెడ్డి తదితరులు శుక్రవారం సచివాలయంలో సీఈవో భన్వర్‌లాల్‌ను కలసి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలియజేశారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులను సత్వరమే పరిష్కరించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితాలో కనిపించిన లోపాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో లోప రహితంగా రూపొందించాలని సీఈఓకు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. భవిష్యత్తులో క్షేత్రస్థాయిలో మరిన్ని ఆకస్మిక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి మద్యం, డబ్బుల పంపిణీని పూర్తిగా నియంత్రించాలని సూచించారు. అనంతరం మీడియాతోనూ, విడివిడిగా టీవీ ఛానళ్లతోనూ మాట్లాడారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలవల్ల గతంతో పోల్చితే రాష్ట్రంలో ఎన్నికలు పూర్తి ప్రశాంతంగా, స్వేచ్ఛగా సాగాయని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకు రాజకీయ పార్టీలు, నాయకులు సంయమనం పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలను రెచ్చగొట్టరాదని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తిచేశారు. ఇంకా వారేమన్నారంటే..
కాకి మాధవరావు: వారికి అనుకూలం కాని నిర్ణయాలు తీసుకున్నందునే భన్వర్‌లాల్‌పై విమర్శలు చేసి ఉంటారు. భన్వర్‌లాల్ ఎవరిమాటా వినరు. విధి నిర్వహణ సమయంలో సహోద్యోగులుగా మేం విన్నవించుకున్నా వినకుండా నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకునేవారు. కాబట్టి ఆయన ఒకరి మాట విని ఒకరికి మేలు చేసి మరొకరికి అన్యాయం చేస్తారనే దానిలో సున్నా శాతం కూడా నిజం లేదు.
నిఘా వేదిక ఛైర్మన్ డాక్టర్ అంబటి లక్ష్మణరావు: అక్కడక్కడా కొన్ని సంఘటనలు మినహా మొత్తమ్మీద ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగా యి. ఓటు వేయడానికి వచ్చిన వారు వెనక్కు వెళ్లడంగానీ, లాఠీచార్జీ జరిగినా ప్రాణనష్టంగానీ ఎక్కడా జరగలేదు. కోట్ల మంది ఓటర్లు, లక్షల మంది సిబ్బంది లక్షల పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగినప్పుడు కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగి ఉండొచ్చు. అయితే వీటినే పోలింగ్ మొత్తానికి ఆపాదించడం సరికాదు.
వి.లక్ష్మణరెడ్డి: 1952లో 52 శాతం పోలింగ్ జరిగితే నేడు గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతంపైగా, సీమాంధ్రలో సగటున 80 శాతం పోలింగ్ జరిగింది. ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓట్లు వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓటమికి రకరకాల కారణాలు వెతుక్కుంటూ ఇతర వ్యవస్థల మీద ముఖ్యంగా రాజ్యాంగ వ్యవస్థల మీద బురద చల్లడం మంచిదికాదు. గతంతో పోల్చితే రిగ్గింగులు, ఘర్షణలు పూర్తిగా తగ్గాయి. ధన ప్రభావం మాత్రం పెరిగింది.