సాక్షి, హైదరాబాద్: హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి దేవాదాయ, ధర్మాదాయ చట్టంలో తీసుకొచ్చిన మార్పులను అమలు చేయాలని చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు సౌందరరాజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తిచేశారు. ఆయన పలువురు ఆలయ అర్చకులతో కలిసి శనివారం ఉదయం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మేనిఫెస్టో కమిటీతో సమావేశమయ్యారు. వైఎస్ మాదిరిగానే దేవాలయాల పరిరక్షణకు వైఎస్సార్ సీపీ చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు ఎన్నికల ప్రణాళికలో చేర్చాలని కోరారు. చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 1987లో దేవాదాయ, ధర్మాదాయ చట్టాన్ని మార్చి రాష్ట్రంలోని దేవాలయ వ్యవస్థను పాడుచేశారని ఆవేదన వ్యక్తంచేశారు.
2003లో వైఎస్ దృష్టికి తాము ఈ విషయాన్ని తీసుకెళ్లి ఆ చట్టాన్ని మార్చాలని కోరామని సౌందరరాజన్ వివరించారు. 2007లో వైఎస్ ఈ చట్టానికి మార్పులు చేసి ధార్మిక పరిషత్ కిందకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ వ చ్చేలా చేశారన్నారు. 2009 ఎన్నికల తరువాత ఈ మార్పులను అమలు చేస్తే దేవాలయాలకు స్వర్ణయుగం వస్తుందనుకున్న తరుణంలో తమ దురదృష్టం కొద్దీ వైఎస్ మరణించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ తరువాత ధార్మిక పరిషత్ గురించి ఎవరూ పట్టించుకోలేదన్నారు.
వైఎస్ ఇచ్చిన హామీలు అమలు చేయడానికి పుట్టిన వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో కమిటీ సభ్యులను కలిసి.. దేవాదాయ చట్టంలో చేసిన మార్పులను అమలు చేయాలని తాము కోరామని.. అందుకు వారు అంగీకరించారని కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని 34 వేల హిందూ దేవాలయాల అర్చకులు, భక్తులు వైఎస్‌ను తమ హృదయాల్లో పెట్టుకున్నారని, ఆయన తీసుకువచ్చిన మార్పులను అమలు చేస్తే దేశం సుభిక్షంగా ఉంటుందని, సమాజం బాగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మేనిఫెస్టో కమిటీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ ఉన్నపుడు హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం చట్టంలో తెచ్చిన మార్పులను అమలు చేయడానికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. అర్చకులు చేసిన సూచనలను తప్పకుండా తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చుతామని హామీ ఇచ్చారు.