సుస్థిర పాలన కాంగ్రెస్‌కే సాధ్యం
- తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెస్సే..
- కేసీఆర్ మాటల మాంత్రికుడు టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య
- మద్దూరులో కోదండరెడ్డి, విజయశాంతితో కలిసి రోడ్‌షో
మద్దూరు, న్యూస్‌లైన్: దేశంలో సుస్థిర పాలన కాంగ్రెస్‌కే సాధ్యమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన మద్దూరు మండల కేంద్రంలో ఎంపీ విజయశాంతి, కోదండరెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు హెలికాప్టర్‌లో వారు మద్దూరుకు చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రోడ్ షో ప్రారంభం కాగా, పొన్నాల మాట్లాడారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాటల మాంత్రికుడని... ఆయన మాటలకు మోసపోవద్దని ప్రజలను కోరారు.తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్సేనని పేర్కొన్నారు.
ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు దేవతగా మారిందని, కృతజ్ఞతగా ప్రజలందరూ చేతిగుర్తుకు ఓటు వేయూలని విజ్ఞప్తి చేశారు. జనగామ ఎమ్మెల్యేగా తనను, భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని కోరారు. అనంతరం పొన్నాల లక్ష్మయ్యను రాష్ట్ర మైనార్టీ నాయకుడు ఖాజా ఆరీఫ్, విజయశాంతికి పొన్నాల వైశాలి శాలువా కప్పి పూలమాలతో సన్మానించారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి మం డల శ్రీరాములు, నాయకులు గిరికొండల్‌రెడ్డి, బండి చంద్రయ్య, వెంకన్న, వెంకటేష్‌గౌడ్, జల్లి సిద్దయ్య, తిరుపతిరెడ్డి, గొర్రె సిద్దయ్య, మొగుళ్ల రాజిరెడ్డి, దాసరి ఆగారెడ్డి, బాల్‌రెడ్డి, బండి కష్ణమూర్తి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, పీఏసీఎస్ డెరైక్టర్లు రాచకొండ ఉప్పలయ్య, తిరుపతిరెడ్డి, రాచకొండ జయశీలాదేవి, సీపీఐ నాయకులు సీహెచ్.రాజారెడ్డి, టి.సత్యం పాల్గొన్నారు. కాగా, స్థానిక ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం గౌడ్ రోడ్‌షోకు గైర్హాజర్ కావడం చర్చనీయాం శంగా మారింది. రోడ్‌షోలో గాయని మధుప్రియ పాడిన పాటలు ప్రజలను ఆకట్టుకున్నాయి. గిరిజనులతోపాటు వైశాలి నృత్యం చేయగా... పొన్నాల డప్పు కొట్టి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
రాహుల్ సభను విజయవంతం చేయాలి : పొన్నాల
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 25వ తేదీన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వరంగల్‌కు రానున్నారని పొన్నాల తెలిపారు. ఈ మేరకు నిర్వహించనున్న బహిరంగ సభకు జనగామ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్‌లు, తెలంగాణవాదులు, మిహ ళలు,యువకులు, రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.