'నేనంటే ఏమనుకుంటున్నారో...'
రాయదుర్గం : నేనంటే ఏమనుకుంటున్నారో... మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తా అంటూ టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి దీపక్ రెడ్డి ఎన్నికల అధికారులు, పోలీసులపై నిన్న వీరంగం వేశారు. వివరాల్లోకి వెళితే దీపక్ రెడ్డికి ఎన్నికల ఏజెంట్గా ఇచ్చిన అనుమతిని ఆర్వో రద్దు చేశారు. ఈ సమాచారం పోలీసులకు అందచేసి ఆయనను హౌస్ అరెస్ట్ చేయాలని సూచించారు. ఈ మేరకు పోలీసులు ఉదయం 7 గంటలకు దీపక్ రెడ్డిని కలిసి హౌస్ అరెస్టు చేస్తున్నామని, ఇంటి నుంచి బయటకు వెళ్లరాదని తెలిపారు. దీనిపై ఆయన ఫైర్ అయ్యారు.
'నేను టీడీపీ ఎమ్పీ అభ్యర్థి ఎన్నికల చీఫ్ ఏజెంట్ను, నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారా, అభ్యర్థులను అడ్డగించినా, నన్ను అడ్డగించే అధికారం మీకులేదు' అంటూ రభస చేశారు. పోలీసులు ఆయనకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా దీపక్ రెడ్డి మొండిపట్టు వీడలేదు. తన ఏజెంట్ అనుమతిని రద్దుచేస్తే నియోజకవర్గంలోని అన్ని బూత్ల ఎన్నికలను నిలపాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ సీపీకి అమ్ముడుపోయారని పోలీసులపై ఆరోపణలు చేశారు.
'కల్యాణదుర్గంలో మీపై పాత కేసులున్నాయి, ఈ కారణంగా అరెస్ట్ చేసి కల్యాణదుర్గానికి తీసుకెళ్తాం' అని సీఐ భాస్కర్ రెడ్డి, డీఎస్పీ రమాకాంత్ రావు ...దీపక్ రెడ్డిని హెచ్చరించారు. దీంతో మెత్తబడిన దీపక్ రెడ్డి పోలీసుల ఆదేశాల మేరకు తన ఇంట్లోకి వెళ్లిపోవడంతో సమస్య సద్దుమణిగింది.