
గోరంట్లకు అలీ కితకితలు
రాజమండ్రి : ఎన్నికలు దగ్గర పడుతున్నా తెలుగుదేశంలో నేతలకు టిక్కెట్ ఫీవర్ వీడడంలేదు. నిన్నటి వరకూ సుంకవల్లి సూర్య, నేడు సినీనటుడు అలీ.. ఇలా రోజుకో పేరు తెరపైకి వస్తుండడంతో తెలుగు తమ్ముళ్లకు బీపీ పెరిగిపోతోంది. ఈ ప్రచారాలు రాజమండ్రి టిక్కెట్‌ను తన హక్కుగా భావించే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కంటికి కునుకులేకుండా చేస్తున్నాయి. ఏదిఏమైనా నేనే ఇక్కడ నెంబర్ వన్ అని చెప్పుకుంటూ ఆయన స్వీయ సంతృప్తిని పొందుతున్నారు.
అలీ ఫీవర్
రెండు రోజులుగా రాజమండ్రి టీడీపీ నేతలకు అలీ ఫీవర్ పట్టుకుంది. ఆదివారం రాజమండ్రిలో పర్యటించిన ప్రముఖ హాస్యనటుడు అలీ తాను రాజమండ్రి నుంచి పోటీ చేస్తానని మరోసారి ప్రకటించడంతో నేతల్లో కలవరం మరింత పెరిగింది. అలీకి అధిష్టానం హమీ ఇచ్చిందనే వార్తలు కూడా షికారు చేస్తున్నాయి. ఈ పరిణామాలు టీడీపీ శ్రేణుల ను అయోమయానికి గురి చేస్తున్నాయి.
ఖండించని మురళీ మోహన్
రాజమండ్రి టీడీపీ పార్లమెంటు అభ్యర్థి మురళీమోహన్ ఆదివారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. అలీ వ్యవహారంపై కార్యకర్తలు అడిగిన ప్రశ్నలకు మురళీమోహన్ ఎక్కడా లేదని చెప్పలేదు. అలీ గురించి అధిష్టానం చూసుకుంటుందని ఆయన మాట దాటేయడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. స్థానికుడైన అలీకి మైనారిటీల పూర్తి మద్దతు ఉందని భావిస్తున్నారు. దీంతో కొందరు నేతలే అలీ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నట్టు తెలుస్తోంది.
కాదు..కాదు నేనే..
కానీ గోరంట్ల మాత్రం రాజమండ్రి అభ్యర్థిని నేనే అని పైకి చెప్పుకుంటున్నారు. కార్యకర్తల సమావేశంలోనూ ఇదే మాట చెప్పారు. సిటీ టికెట్ తనదేనన్న ధీమాతో పార్టీ తరఫున కార్పొరేషన్ ఎన్నికల్లో అంతా తానై వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అలీ వ్యవహారం గోరంట్లకు మింగుడు పడడంలేదు.
పార్టీలో గోరంట్ల నియంతృత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్న కొందరు ముఖ్యులు కూడా అలీ ప్రతిపాదనకు సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే మురళీమోహన్ కూడా లేదు కాదు అనకుండా అధిష్టానంపై నెట్టే ప్రయత్నం చేశారంటున్నాయి పార్టీ వర్గాలు. అలీ కూడా సినీ వర్గం కావడంతో మురళీమోహన్‌కు కొంత సానుకూలత ఉంటుందని చెబుతున్నారు.
ఇంకా రాజమండ్రి రూరల్ టికెట్‌పై ఇంకా క్లారిటీ లేని తరుణంలో అభ్యర్థుల మార్పులు ఉండవచ్చనే అభిప్రాయాన్ని పలువురు నేతలు సైతం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అలీ మేటర్ తేలిగ్గా లీసుకోవాల్సింది కాదని పరిశీలకులు అంటున్నారు.