మూడింటా.. మళ్లీ మునకేనా!
- ఎంపీ స్థానాల్లో టీడీపీ ఎదురీత
- కష్టించిన వారిని విస్మరించిన అధినేత
- కాకినాడ, అమలాపురాల్లో వలసనేతలకే చాన్స్
- సహాయ నిరాకరణ చేస్తున్న పార్టీ శ్రేణులు
- రాజమండ్రిలో మురళీమోహన్‌కు తప్పని ప్రతికూలత
సాక్షి ప్రతినిధి, కాకినాడ : మారుతున్న సమీకరణలతో జిల్లాలోని మూడు పార్లమెంటు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఏటికి ఎదురీదుతోంది. గత రెండు ఎన్నికల్లో ఆ స్థానాల్లో పార్టీ తరఫున చంద్రబాబు ఎవరిని బరిలోకి దింపినా ఓటమి తప్పలేదు. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా అదే పునరావృతమవుతుందన్న నిఘావర్గాల నివేదికలతో ఆ పార్టీ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కనపెట్టి, డబ్బు సంచులతో వలస వచ్చిన వారికి సీట్లు ఇచ్చిన టీడీపీ జిల్లాలో కొత్త కుంపటిని రాజేసుకుంది. అసెంబ్లీ అభ్యర్థుల్లో సమర్థులు లేకపోవడం, వారికి, ఎంపీ అభ్యర్థులకు మధ్య కొరవడిన సమన్వయం, చంద్రబాబు ఒంటెత్తు పోకడలతో విసుగెత్తిన పార్టీ శ్రేణుల సహాయ నిరాకరణ...ఈ పరిస్థితే దాదాపు మూడు పార్లమెంటు స్థానాల్లోనూ కనిపిస్తోంది.
పార్టీ నేతలకే తెలియని ‘పండుల’
ఎస్సీలకు రిజర్వు చేసిన అమలాపురం ఎంపీ స్థానం నుంచి పార్టీ ముఖ్య నాయకులకు కనీసం ముఖపరిచయం కూడా లేని పండుల రవీంద్రబాబును బరిలోకి దింపడంతో పార్టీ శ్రేణుల్లో నిస్తేజం అలముకుంది. అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ అన్ని కోణాల్లో సమర్థుడైన మాజీ మంత్రి, తాజా మాజీ ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్‌ను బరిలోకి దింపడంతోనే టీడీపీలో కలవరం మొదలైంది. విశ్వరూప్ తనకంటూ సొంత బలగాన్ని సిద్ధం చేసుకుని, ఇతర సామాజికవర్గాల మద్దతు కూడగట్టడంలో నిమగ్నమయ్యారు. అమలాపురం ఎంపీ అభ్యర్థిగా ఏడాది క్రితమే మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును ప్రకటించారు. చివర్లో ఆయనను కాదని పండుల రవీంద్రబాబునుకు అభ్యర్థిత్వం కట్టబెట్టడంతో ఎదురైన అసంతృప్తిని చల్లార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఆర్థికంగా స్థితిమంతుడన్నది తప్ప రవీంద్రబాబుకు టిక్కెట్ ఇవ్వడానికి కారణమేముందని కేడర్ ఆవేదన చెందుతోంది. నియోజకవర్గానికి కొత్త కావడం, నాయకులు, అక్కడి ప్రజలతో పెద్దగా పరిచయాలు కూడా లేకపోవడంతో రవీంద్రబాబు ప్రచారంలో వెనుకబడ్డారనే చెప్పాలి. గొల్లపల్లి నుంచి ఎదురైన అసంతృప్తి జ్వాలలను చక్కదిద్దుకునేందుకే సమయాన్నంతటినీ వెచ్చించాల్సి వచ్చిందని, ఈలోపు పుణ్యకాలం కాస్తా గడిచి పోతోందని రవీంద్రబాబు వర్గీయులు అంటున్నారు. నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఒకటి, రెండు చోట్ల తప్ప మిగిలిన చోట్ల అభ్యర్థులు పోటీ ఇవ్వగలిగే స్థితిలో లేకపోవటం, ప్రచారంలో వెనుకబాటు, నాయకులను సమన్వయం చేసుకోలేని రాజకీయ అనుభవరాహిత్యం వంటి ప్రతికూలతలతో రవీంద్రబాబు పరిస్థితి అగమ్య గోచరంగా ఉందంటున్నారు. నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యాకులైన ఎస్సీ సామాజికవర్గం మొదటి నుంచీ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ వైపే మొగ్గుతున్నారు. డబ్బు ఒక్కటే ప్రామాణికంగా పరిగణిస్తున్న అధినేత తీరును పార్టీ శ్రేణులు గర్హిస్తున్నాయి. కాగా జై సమైక్యాంధ్ర నుంచి బరిలోకి దిగిన సిట్టింగ్ ఎంపీ జీవీ హర్షకుమార్ పోటీ నామమాత్రమేనంటున్నారు.
‘తోట’కు కలిసిరాని కేడర్
దాదాపు ఇదే పరిస్థితి కాకినాడ ఎంపీ నియోజకవర్గంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ అవకాశాన్ని ఆశించి, ముందు నుంచీ పార్టీ కోసం పని చేసిన పోతుల విశ్వంను కాదని, మాజీ మంత్రి తోట నరసింహంకు టిక్కెట్టు ఇవ్వడం పార్టీ శ్రేణులకు జీర్ణం కావడం లేదు. విభజనకు కారణమైన కాంగ్రెస్‌లో ఉంటే రాజకీయంగా అడ్రస్ ఉండదన్న ముందుచూపుతో తోట కాంగ్రెస్‌ను వీడి టీడీపీ పంచన చేరారు. తుది శ్వాస వరకు కాంగ్రెస్‌ను వీడేది లేదన్న నరసింహం రాత్రికిరాత్రే ఫిరాయించేసి ‘సైకిల్’ ఎక్కేసినా ద్వితీయశ్రేణి నేతలు, కేడర్ మాత్రం ఆయనకు మద్దతు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. జగ్గంపేట ఎమ్మెల్యేగా, మంత్రిగా వ్యతిరేకతే మూటగట్టుకున్న తోట ఎంపీ అభ్యర్థిగా ఎలా నెగ్గుకురాగలరని తెలుగుతమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న’ చందంగా.. కాపు సామాజికవర్గానికి వైఎస్సార్ సీపీ 8 అసెంబ్లీ స్థానాలు ఇచ్చిందనే ఉద్దేశంతో పిఠాపురం, పెద్దాపురంలలో చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చేసి కాపు సామాజికవర్గానికి కట్టబెట్టడం ద్వారా ఆ ఫార్ములాను ఫాలో అయ్యామన్న టీడీపీ చివరకు చేతులు కాల్చుకుంది. మంత్రిగా ఎదురైన వ్యతిరేకత తోటపై పడి పార్టీని దెబ్బ తీస్తోందని పార్టీ శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రమంత్రి పళ్లంరాజుకు పీఆర్పీ నుంచి గట్టి పోటీ ఇచ్చిన చలమలశెట్టి సునీల్ ఈ సారి వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు. పార్టీకి వివిధ వర్గాల్లో ఉన్న ఆదరణ, గత ఓటమి అనంతరం నాయకులు, కేడర్‌తో మమేకమై ఉండటంతో సునీల్‌కు గెలుపు ధీమానిస్తున్నాయి.