సాక్షి ప్రతినిధి, ఒంగోలు,‘అధిష్టానం పట్టించుకోకపోయినా..కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని అంటిపెట్టుకొని ఉన్నాం. పక్క పార్టీలు కాదన్న నాయకుల్ని పిలిచి మరీ పార్టీలో చేర్చుకుని.. వారిని అందలమెక్కిస్తున్నారు. ప్రజాదరణ లేనివారిని అక్కున చేర్చుకుని.. మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు..దీన్ని ఇక సహించం. అధిష్టానానికి చుక్కలు చూపిస్తాం’ అంటున్నారు టీడీపీ నాయకులు. పార్టీలో ఉన్న వారిని పట్టించుకోని చంద్రబాబునాయుడు కాంగ్రెస్ నాయకుల్ని టీడీపీలో చేర్చుకుంటుండటంతో ఆ పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా సంతనూతలపాడుకు సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయకుమార్‌ను పార్టీలోకి తీసుకురావడంతో పాటు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఆయనకు కట్టబెట్టే ఆలోచనలో చంద్రబాబు ఉండటాన్ని నియోజకవర్గ టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. ఇన్నాళ్లూ జెండాలు మోసి, పార్టీ కోసం కృషి చేసిన వారిని కాదని నిన్నటి వరకు టీడీపీ నాయకులపై బురదజల్లిన కాంగ్రెస్ నేతలకు పార్టీ టికెట్ ఇవ్వడం సరికాదని బహిరంగంగానే చెబుతున్నారు.
గతంలో విజయకుమార్ కాంగ్రెస్‌లోనే ఉంటూ టీడీపీకి సహకరించారని..అదేవిధంగా రేపు తెలుగుదేశంలో ఉంటూ మరో పార్టీకి సహకారం అందించడని నమ్మకం ఏముందని ప్రశ్నిస్తున్నారు. విజయకుమార్‌ను పార్టీలోకి తీసుకోకూడదని గతంలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరాం నేతృత్వంలో ఒక తీర్మానం కూడా ఆమోదించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
సంతనూతలపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని పార్టీ నాయకులు శ్రీరామ్ మాల్యాద్రి, వివరం గోవిందు, గూడూరి ఎరిక్షన్‌బాబు, బి. రమేష్‌బాబు వంటి నాయకులు ఆశిస్తున్నారు. వీరందరినీ కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన విజయకుమార్‌కు ఇవ్వాలన్న ఆలోచనను పార్టీ నాయకులు తప్పుపడుతున్నారు. విజయకుమార్ ఇటీవల టీడీపీకి చెందిన 22 మంది రేషన్ డీలర్లను తొలగించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మధ్యలో కల్యాణి అనే మహిళకు ఈ సీటు కేటాయించేందుకు ప్రయత్నించడం..తరువాత విజయకుమార్ చంద్రబాబునాయుడిని కలుసుకోవడంతో ఆయనకు సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
విజయకుమార్‌ను పార్టీలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకించిన ఆ పార్టీ నాయకుడు మారెళ్ల బాబు టీడీపీకి రాజీనామా చేసి ఇటీవల వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయన బాటలోనే పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి మన్నం శ్రీధర్‌బాబు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఒకటిరెండు రోజుల్లో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆయనతో పాటు మరికొంతమంది టీడీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు.
చుక్కలు చూపిస్తాం !
Published Thu, Apr 3 2014 2:39 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement
Advertisement