సాక్షిప్రతినిధి, నల్లగొండ: రోజురోజుకూ దిగజారుతున్న తెలుగుదేశం పార్టీని పట్టాలెక్కించేందుకు..ఈ ఎన్నికల్లో ఎలాగైనా అభ్యర్థులను గట్టెక్కించేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. ఇప్పటికే పార్టీలో గుంపులలొల్లి కేడర్‌ను, నాయకులను గందరగోళానికి గురిచేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో చంద్రబాబు జిల్లా పర్యటనకు వస్తున్నారు. నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో బహిరంగసభల్లో పాల్గొంటారు. నల్లగొండ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో బాబు ప్రచారం చేయనున్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో దేవరకొండకు చేరుకుంటారు. తొలుత ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం రోడ్డు మార్గం గుండా హాలియా, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట పట్టణాలలో జరిగే సభల్లో ప్రసంగిస్తారు.
ఇప్పటికే తమ్ముళ్ల మధ్య పోరు..
చట్టసభల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయిస్తామని ఎన్నికల హామీ గుప్పిం చారు. దీనిలో భాగంగానే ఈ ఎన్నికల్లో టీడీపీ 4 అసెంబ్లీ స్థానాలను బీసీలకు కేటాయించింది. నాగార్జునసాగర్‌కు కడారి అంజయ్య యాదవ్, మిర్యాలగూడ-బంటు వెంకటేశ్వర్లు, హుజూర్‌నగర్- వంగాల స్వామిగౌడ్, కోదాడ- బొల్లం మల్లయ్య యాదవ్‌కు సీట్లు కేటాయించారు. బీసీలకు నాలుగు టికెట్లు ఇవ్వడాన్ని పార్టీలోని మరో సామాజిక వర్గం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనినే అదునుగా చేసుకుని ప్రధాన పార్టీలు.. తమ్ముళ్ల పోరును తమవైపు లాక్కునేందుకు బేరసారాలకు దిగుతున్నారు.
గుంపుల గొడవ
జిల్లా నాయకుల మధ్య నెలకొన్న గ్రూపు తగాదాలతోనే కిందా మీద పడుతున్న ఆ పార్టీ ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. దీంతో మొత్తం 12 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు 8 స్థానాల్లో పోటీ చేస్తుండగా, మిగిలిన నాలుగు స్థానాలను బీజేపీకి వదిలేశారు. నల్లగొండలో టీడీపీకి చెందిన కంచర్ల భూపాల్‌రెడ్డి బరిలోకి దిగారు. దీంతో ఆయనను పార్టీ నాయకత్వం సస్పెండ్ కూడా చేసింది. ఆయన పోటీతో బీజేపీ అభ్యర్థి ఇబ్బంది పడుతున్నారు. ఇక సూర్యాపేట విషయానికొస్తే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సంకినేని వెంకటేశ్వరరావుకు టికెట్ చేజారిపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దీంతో టీడీపీ అభ్యర్థి పటేల్ రమేష్‌రెడ్డి కొంత గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.
మిర్యాలగూడ నియోజకవర్గంలో పార్టీలో కీలకపాత్ర పోషించిన గార్లపాటి నిరంజన్‌రెడ్డి ఇటీవలే టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన వెంట ఉన్న తమ్ముళ్లు బంటుకు పూర్తిస్థాయిలో సహరించడం లేదు. హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో పార్టీలో నెలకొన్న విభేదాలు ఏ వైపునకు దారితీస్తాయో అన్న ఆందోళన టీడీపీ శ్రేణుల్లో నెలకొంది. కోదాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావును కాదని బొల్లం మల్లయ్య యాదవ్‌కు టికెట్ ఇచ్చారు. హుజూర్‌నగర్‌లో వంగాల స్వామిగౌడ్‌కు వ్యతిరేకంగా మరొక బలమైన సామాజిక వర్గం పని చే స్తోంది. నిన్నామొన్నటి దాకా నకిరేకల్ నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా ఉన్న పాల్వాయి రజినీకుమారిని తుంగతుర్తి స్థానానికి పంపారు. నకిరేకల్ సీటే ఖాయమని భావించిన ఆమె కు చివరి నిమిషంలో స్థానం మారడంతో అక్కడి పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదు.
దేవరకొండలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బిల్యానాయక్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్, సీపీఐ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాయి. దీంతో గెలుపు కోసం బిల్యానాయక్ సర్వశక్తులు ఒడ్డాల్సి వస్తోంది. గత ఎన్నికల్లో మాజీ మంత్రి జానారెడ్డికి గట్టి పోటీ ఇచ్చిన తేరా చిన్నపరెడ్డి మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ, టీడీపీ పొత్తు, టికెట్ లభించక పార్టీకి దూరమైనవారు.. పార్టీలో పాతుకుని పోయిన వర్గ విభేదాలు వెరసి.. ఈ ఎన్నికల్లో టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
టీడీపీ..ఉక్కిరి బిక్కిరి
Published Sun, Apr 20 2014 3:18 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement