తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే...
కొన్ని కఠినవాస్తవాలను జీర్ణించుకోవడం తెలుగు తమ్ముళ్లకు చాలా కష్టంగా మారిందట. ఇప్పుడిప్పుడే చేదునిజాన్ని మింగేందుకు సిద్ధమవుతున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లా నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఒక టీడీపీ నాయకుడికి పెద్ద రైల్వే కాంట్రాక్ట్ దొరికిందట. అయితే తెలంగాణలో కాకుండా గుంటూరుజిల్లా నరసరావుపేటలో కావడంతో ఏది ఏమైనా అక్కడ ఉన్నది మన టీడీపీ ప్రభుత్వమేకదా అని సదరు నేత హుషారుగానే ఉన్నాడట. అయితే అక్కడి స్థానిక టీడీపీ నాయకుల అనుయాయులు వచ్చి ఈ పనులను మొదలుపెట్టకుండా అడ్డుకున్నారట.
ఇంతకు ఎందుకని ఆరాతీస్తే తమకు దక్కాల్సిన అయిదు శాతం కమిషన్ ఇవ్వాల్సిందేనని అప్పుడే పనులంటూ ఆ టీడీపీ నాయకుడు హుకుం జారీచేసేశారట. దీనితో ఖంగుతున్న నల్లగొండ నాయకుడు తెలంగాణ టీడీపీ ముఖ్యనేతతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబును కలుసుకుని తన గోడును వెళ్లబోసుకున్నారట. కొంత ఆశ్చర్యానికి గురైన చంద్రబాబు నరసారావుపేట టీడీపీ నాయకుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. అయితే ఆ నాయకుడు ససేమిరా అనడంతో పాటు తన క మీషన్ తనకు దక్కాల్సిందేనంటూ ఖరాఖండిగా చెప్పేశారట. ఈ పరిణామంతో టీడీపీనాయకుల పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లుగా తయారైందట. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటే ఇదేనేమో అన్నట్లుగా పరిస్థితి తయారైందట తెలుగు తమ్ముళ్లు తెగ గింజుకుంటున్నారట....