జాగృతిది.. ప్రతిపక్ష పాత్ర
తెలంగాణ ఉద్యమంలో బీజేపీ ఎంతోకొంత పాల్గొందని, అలాంటి పార్టీ తెలంగాణకు పూర్తిగా వ్యతిరేకమైన టీడీపీతో జతకట్టడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా తెలంగాణ జాగృతి సంస్థ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రలో వైఎస్ జగన్‌కి పట్టం కట్టనున్నారని చెప్పారు.
ఎలక్షన్ సెల్
తెలంగాణ వ్యతిరేక పార్టీతో బీజేపీ పొత్తుకోవడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇక్కడి బీజేపీ నాయకులకు కనీస విలువ ఇవ్వకుండా చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు కలిసి మొత్తం పెత్తనమంతా నడిపి పొత్తు కుదుర్చుకున్నారు. ఈ విషయంలో బీజేపీలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. ఇక టీఆర్‌ఎస్‌తో పొత్తుకు పలు పార్టీలు ఆహ్వానించినా ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగాలని టీఆర్‌ఎస్ నిర్ణయించుకుంది.
తెలంగాణలో కేసీఆర్.. ఆంధ్రలో జగన్
దేశవ్యాప్తంగా నూతన, యువ నాయకత్వానికి ప్రజలు పట్టంగడుతున్నారు. తెలంగాణ సాధించిన పార్టీగా టీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడతారు. తెలంగాణలో టీడీపీ పూర్తిగా కనుమరుగైంది. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. టీడీపీతో పొత్తు వల్ల తెలంగాణలో బీజేపీ నష్టపోవడం ఖాయం. ఆంధ్రలో వైఎస్సార్ సీపీ స్వీప్ చేస్తుంది. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రావడం ఖాయం. టీడీపీలోకి మాజీ మంత్రులు వచ్చి చేరినా సీమాంధ్రలో ఆ పార్టీకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్రజలు కొత్త నాయకత్వాన్ని, యువకిశోరాలను కోరుకుంటున్నారు.
తెలంగాణ యువతను గాయపరిచిన పవన్
పవన్‌కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు. మా సంస్థపై ఆయన చేస్తున్న విమర్శల్లో అర్థం లేదు. మా సంస్థ విరాళాల గురించి ఆయన ప్రశ్నిస్తున్నాడు. అవన్నీ పారదర్శకంగా ఉన్నాయి. ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా, నిబద్ధతగా, పాదర్శకంగా నడుస్తోంది. గత ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ ఏమైనా కార్యక్రమాలు చేశాడా? మేం జాగృతి సంస్థ ద్వారా 500 వరకు కార్యక్రమాలు నిర్వహించాం. తెలంగాణ వ్యతిరేక లాబీలో ఉండి ఆయనిలా మాట్లాడుతున్నాడు. తెలంగాణ కోసం వందలాది మంది అమరులైతే అది ఆయన కంటికి కనిపించలేదా? వారి గురించి కనీసం ఒక్కసారైనా మాట్లాడాడా? పోనీ సమైక్యాంధ్ర కోసం చనిపోయిన వారినైనా ఆయన పట్టించుకున్నాడా? పవన్, నాగార్జున మోడీని కలిసి తెలంగాణ యువతను గాయపరిచారు. అసలు పవన్ గురించి ఆలోచించడమే అనవసరం.
పునర్నిర్మాణం ఇలా ఉండాలి
తెలంగాణ పునర్నిర్మాణంలో వ్యవసాయం లాభసాటిగా మారాలి. ప్రజలు పేదరికం నుంచి బయటపడాలి. విద్యావకాశాలు పెరగాలి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన మైనర్ ఇరిగేషన్‌ను త్వరలో ఏర్పడబోయే ప్రభుత్వం పునరుద్ధరించాలి. అలాగే మధ్య తరహా, భారీ సాగునీటి ప్రాజెక్టులపైనా దృష్టి సారించాలి. జిల్లాకో మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయాలి. బలహీన వర్గాలకు అవకాశాలు పెంచాలి. పారిశ్రామికీకరణపై దృష్టి పెట్టాలి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను ప్రవేశపెట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి అందుకోసం రూ.వందకోట్లు కూడా ఖర్చుచేయలేదు. రేపటి తెలంగాణలో దానిని పక్కాగా అమలుచేయాలి. వక్ఫ్ భూములను రక్షించుకోవాలి. ప్రతీ మండలంలోనూ ఒక మహిళా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలి. పేదలకు మూడెకరాల భూమి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. అయితే ఆ భూమిని మహిళల పేరుమీద ఇవ్వాలని ఆయనకు సూచించా. మహిళా అక్షరాస్యత పెరగాలి. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది.
‘జాగృతి’దే కీలక పాత్ర
తెలంగాణ ఏర్పాటు కాగానే తెలంగాణ జాగృతి సంస్థ ఏంచేస్తుందన్న సందేహం చాలామందిలో ఉంది. ఈ సంస్థ ఎప్పటికీ ఉంటుంది. తెలంగాణ పునర్నిర్మాణంలో అది కీలక పాత్ర పోషిస్తుంది. పాలనలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తుంది. ఒకరకంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలన్నదే మా ఉద్దేశం. టీఆర్‌ఎస్సే కాదు.. ఎవరు అధికారంలో ఉన్నా జాగృతి సంస్థ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. బతుకమ్మను తెలంగాణ రాష్ట్ర పండుగగా చేయాలన్న ‘జాగృతి’ డిమాండ్ మేరకు టీఆర్‌ఎస్ దానిని ప్రణాళికలో చేర్చింది. ప్రభుత్వం వచ్చాక ఏదో మొక్కుబడిగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తే జాగృతి సంస్థ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. అలాగే తెలంగాణ సినీ కళాకారులను ప్రోత్సహించేందుకు రాయితీలు, ఇతర వసతులు కల్పించాలి. సినిమాలు ఎవరు తీసినా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటూ ప్రోత్సహించాలి. ఉద్యమ సమయంలో భావోద్వేగాలు ఎలా ఉన్నా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.