సదస్సులో మాట్లాడుతున్న శేఖర్ గుప్తా, చిత్రంలో కవిత, ఒవైసీ, సీమా మల్హోత్రా, గౌరవ్ గొగోయ్
సాక్షి, హైదరాబాద్: ‘మన దేశం యంగ్ ఇండియా అని గర్వంగా చెప్పుకుంటున్నప్పటికీ.. భారత్‌లో యువత సమస్యలను అర్థం చేసుకోవడంలో ఎంపీ లు, విధాన రూపకర్తలు విఫలమయ్యారు. ఈ పరిస్థి తి మారి యువత రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొనాల్సిన సమయం ఆసన్నమైంది’ అని తెలం గాణ జాగృతి అంతర్జాతీయ యువ సదస్సు (టీజేఐ వైసీ)లో వక్తలు అభిప్రాయపడ్డారు. హైటెక్‌సిటీ నోవాటెల్ హోటల్‌లో శనివారం ‘వాక్ ద టాక్ ఆన్ యూత్ డెవలప్‌మెంట్’ పేరుతో జరిగిన చర్చాగోష్టిలో.. నిజామాబాద్ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కవిత (టీఆర్‌ఎస్), హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం), అసోం ఎంపీ గౌరవ్ గొగోయ్‌లతోపాటు బ్రిటన్‌లోని లేబర్ పార్టీ ఎంపీ సీమా మల్హోత్రా పాల్గొన్నారు.
భారత్‌లో మధ్యవయస్కు లు, అంతకన్నా పెద్ద వయసున్న వారే ఎక్కువ సంఖ్యలో పార్లమెంటుకు ఎంపికవుతున్నందునే.. యువత సమస్యలను అర్థం చేసుకోవడం లేదని సీని యర్ జర్నలిస్టు శేఖర్ గుప్తా అన్నారు. దీన్ని ఒవైసీ సమర్థిస్తూ.. పార్లమెంటులో ఎంపీల వయసుకు సబంధించిన గణాంకాలను వెల్లడించారు. ప్రస్తుత లోక్‌సభలో ఎంపీల సగటు వయసు 55ఏళ్లుగా ఉందని.. 40ఏళ్లు, అంతకంటే తక్కువ వయసున్న వారు 13% కంటే తక్కువగా ఉన్నారని ఒవైసీ వివరించారు. నిరుద్యోగ సమస్య పెరిగిపోతుండటం, గత కొన్నేళ్లలోనే ఐటీ రంగంలో లక్షల ఉద్యోగాలు తగ్గిపోవడం వంటివన్నీ దేశ పార్లమెంటరీ వ్యవస్థలో లోపాన్ని ఎత్తిచూపుతున్నాయన్నారు. ఈ పరిస్థితి మారి యువతకు రాజకీయరంగంలో మరిన్ని అవకాశాలు కల్పించాలని ఒవైసీ ఆకాంక్షించారు. బ్రిటన్ ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ.. యూకేలో యువత సమస్యలు భారత్‌తో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. మానసిక సమస్యలు, ఆత్మహత్యలపై అక్కడ జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని.. ప్రభుత్వాలు కూడా ఈ అంశాలపై దృష్టిపెట్టి పరిష్కారిస్తున్నాయని వివరించారు.
దేశమంతా ఒక్కటేనని గుర్తిస్తే..
జనాభా నియంత్రణ పథకాలు సమర్థవంతంగా అమలుచేసిన దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర నిధుల్లో వాటా తక్కువగా ఉండటంపై కవిత మాట్లాడారు. ఈ విషయంలో దేశమంతా ఒక్కటేనని అందరూ గుర్తించాలని.. రాష్ట్రాలకు కేంద్ర నిధుల పంపిణీ విధానంలో మార్పులు చేయడం ద్వారా ఈ సమస్య ను అధిగమించవచ్చని ఆమె పేర్కొన్నారు. పేదరి కం, ఉపాధి కల్పన వంటి చాలా అంశాలు అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపు ఒకే తీరుగా ఉంటాయని.. ఈ అంశాలకు సంబంధించి జనాభా ప్రాతిపదికన నిధు ల పంపిణీ చేయడం తప్పేమీ కాదన్నారు. అయితే.. మిగిలిన అంశాల్లో మెరుగైన పనితీరు కనబరిచే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. యువతను రాజకీయాల్లోకి ప్రోత్సహించేందుకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరంపైనా చర్చ జరగాలని ఆమె పేర్కొన్నారు. అసోం ఎంపీ గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక సరళీకరణలకు పాతికేళ్లు దాటినా.. ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి మాత్రం రెండు దశాబ్దాలు వెనుకబడే ఉందన్నారు. ఇందుకు కారణాలేమైనా.. దీని ప్రభావం మాత్రం యువతపై స్పష్టంగా కనబడుతోందన్నారు. తండ్రు లు రాజకీయాల్లో ఉండటం తమకు కొంతవరకు కలి సొచ్చినా.. దీర్ఘకాలం ఈ రంగంలో కొనసాగేందుకు మాత్రం కష్టపడాల్సిందేనని గౌరవ్, అసదుద్దీన్, కవిత స్పష్టం చేశారు.
కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే: ఒవైసీ
ఎవరెన్ని చెప్పినా కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని ఒవైసీ పేర్కొన్నారు. కశ్మీర్ ప్రజలు, యువకులు భారతీయులే అనడంలో సందేహించాల్సిన అవసరం లేదన్నారు. అయితే.. కశ్మీర్ సమస్య పరిష్కరించేందుకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు చిత్తశుద్ధితో పనిచేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘కశ్మీర్ లోయలో సాధారణ పరిస్థితులు నెలకొనాలంటూ అందరూ ప్రకటనలు చేస్తారు. తీరా పరిస్థితులు చక్కబడగానే కశ్మీర్‌లో చేయాల్సిన అభివృద్ధిని మరిచి పోతున్నారు’అంటూ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు చేశారు. ఈ వివాదంపై కేంద్రానికి ఓ స్థిరమైన విధానం లేదని.. నాలుగున్నరేళ్లలో కశ్మీరీ పండిట్ల కోసం గానీ.. అక్కడి యువత కోసం గానీ.. మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఒవైసీ ఆరోపించారు. ప్రభుత్వాలు తమను పట్టించుకోవడం లేదనే అభిప్రాయం అక్కడి యువతలో ఉందన్నారు. అయితే కశ్మీర్ సమస్య సినిమాల్లాగా యుద్ధం చేసి పరిష్కరించేది కాదని.. ఇరువర్గాల్లో ఒకరు రాజనీతిజ్ఞతతో వ్యవహరించాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment