జగదేవ్‌పూర్‌పై సర్వత్రా ఉత్కంఠ | tension on jagdevpur victory due to its range of kcr form house | Sakshi
Sakshi News home page

జగదేవ్‌పూర్‌పై సర్వత్రా ఉత్కంఠ

Published Sat, Apr 5 2014 12:17 AM | Last Updated on Thu, Aug 16 2018 1:18 PM

tension on jagdevpur victory due to its range of kcr form house

గజ్వేల్, న్యూస్‌లైన్: జగదేవ్‌పూర్ మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్ ఉండటంతో ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్, టీడీపీలు సైతం మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. ఆదివారం ఈ మండలంలో పోలింగ్ జరుగుతుండడంతో పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డాయి. ఈ మండలంలో 13 స్థానాలున్నాయి. ఎంపీపీ స్థానం ఎస్సీ (మహిళ)కు రిజర్వు అయింది. తీగుల్ నర్సాపూర్ ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళకే రిజర్వు కావడంతో ఇక్కడి నుంచి మాసపాక శకుంతల(కాంగ్రెస్), తుడుం సువర్ణ(టీడీపీ), గడ్డం వినోద(టీఆర్‌ఎస్)లు పోటీ చేస్తూ ఎంపీపీ పదవిపై కన్నేశారు. తాము కూడా ఎంపీపీ బరిలో ఉన్నట్టు మునిగడప ఎంపీటీసీ స్థానం పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థి మరాటి బాలమణి, వర్ధరాజ్‌పూర్ జనరల్ స్థానం నుంచి పోటీలో ఉన్న కాంగ్రెస్‌కు చెందిన తుమ్మ ధనలక్ష్మి ప్రకటించారు.


  ఇదిలావుంటే జెడ్పీటీసీ అభ్యర్థులుగా టీడీపీ నుంచి మండలంలోని నర్సన్నపేటకు చెందిన ఎంబరి రాంచంద్రం, టీఆర్‌ఎస్ నుంచి తీగుల్‌కు చెందిన రంగ వెంకట్‌గౌడ్, కాంగ్రెస్ నుంచి చేబర్తికి చెందిన రాందాస్‌గౌడ్‌లు ప్రధానంగా పోటీలో ఉన్నారు. జెడ్పీటీసీతోపాటు మెజార్టీ ఎంపీటీసీ స్థానాలను గెలుచుకునేందుకు ఈ మూడు పార్టీలు శ్రమిస్తున్నాయి. సెంటిమెంటే ఆయుధంగా టీఆర్‌ఎస్ ప్రజల్లోకి వెళ్లింది. గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేయడం ఖరారు కావడంతో ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తమ పార్టీ అధినేత ఫామ్‌హౌస్ ఇక్కడే ఉండటంతో ఆయన ఈ మండలంపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశముంటుందనే విషయాన్ని ప్రచారం చేసుకుంటున్నారు.
 కాంగ్రెస్, టీడీపీలు మాత్రం స్థానిక నాయకత్వాన్నే బలపరచాలని ఓటర్లను కోరాయి.

 ఈ మేరకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే నర్సారెడ్డి తీవ్రంగా శ్రమించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కంటే తక్కువ స్థానాలొస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్యే నర్సారెడ్డి ప్రకటించారు. కేసీఆర్‌ను గెలిపిస్తే దొరల పాలన వస్తుందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రతాప్‌రెడ్డి ఓటర్ల దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం పోలింగ్ జరగనున్న తరుణంలో ఈ మండలంపై అన్ని వర్గాల్లోనూ సహజంగానే ఆసక్తి నెలకొన్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement