సాక్షి, అనంతపురం/అనంతపురం కలెక్టరేట్ : ఓటర్ ‘డే’ రానే వచ్చింది. ఐదేళ్ల తమ భవిష్యత్‌ను నిర్దేశించే నాయకుడిని ఎన్నుకునేందుకు ఇదే మంచి తరుణం. విశ్వసనీయతకు పట్టం కట్టండి. మీ తలరాతను మార్చుకోండి. ఈవీఎంలో మీట నొక్కి దుమ్ముదులపండి. దాదాపు 25 రోజుల పాటు ప్రచారాలతో హోరెత్తించిన అభ్యర్థుల భవితవ్యాన్ని మీరే నిర్ణయించండి. సార్వత్రిక సంగ్రామం తుది ఘట్టానికి చేరుకుంది. బుధవారం జిల్లాలోని రెండు పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేసేలా అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంది.
పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేసినా, ఓటు ఎవరికి వేశారని ఎవరైనా ఆరా తీసినా కేసు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. 2009 ఎన్నికల్లో 72 శాతం పోలింగ్ నమోదవగా ఈసారి 90 శాతం పోలింగ్ లక్ష్యంగా అధికాయ యంత్రాంగం ఇప్పటికే ఓటు హక్కు వినియోగంపై విస్తృత ప్రచారం చే సింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 71.49 శాతం, స్థానిక ఎన్నికల్లో 82.5 శాతం పోలింగ్ నమోదైంది. ఇదే స్ఫూర్తితో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా 29,81,937 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 3,334 పోలింగ్ కేంద్రాల్లో 23,142 మంది సిబ్బందిని నియమించారు.
3,858 మంది పీఓలు, 3,870 మంది ఏపీవోలు, 15,414 మంది ఇతర పోలింగ్ అధికారులతో పాటు ఇతర సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. 1634 కేంద్రాల్లో వెబ్ కెమెరాలు, 1038 పోలింగ్ కేంద్రాల్లో వీడియో కెమెరాలు ఏర్పాటు చేశారు. అనంతపురం అర్బన్, గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండేసి ఈవీఎంలు (యూనిట్లు) వినియోగిస్తున్నారు. ఎన్నికల పర్యవేక్షణకు 453 మంది రూట్ మొబైల్స్‌ను, 24 కంపెనీల సెంట్రల్ పారా మిలటరీ ఫోర్స్, 439 మంది హెడ్‌కానిస్టేబుల్స్, 2,666 మంది కానిస్టేబుల్స్, 2,811 మంది హోంగార్డులు, 1357 ఏఆర్ కానిస్టేబుళ్లు, 14 మంది డీఎస్పీలు, 79 మంది సీఐలు, 241 మంది ఎస్‌ఐలు, 284 ఏఎస్‌ఐలను నియమించారు.
ఈ ఎన్నికల్లో నోటా : మునుపెన్నడూ లేనివిధంగా కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారిగా ఈ ఎన్నికల్లో నోటా (తిరస్కరణ) ఓటు ప్రవేశపెట్టింది. బరిలో ఉన్న అభ్యర్థులు నచ్చక లక్షలాది మంది ఓటర్లు ఓటుకు దూరంగా ఉంటున్నారు.
దీంతో తిరస్కరణ ఓటును ఎన్నికల సంఘం అమలు చేసింది. ఈవీఎంలో చివరి వరుస నంబర్‌ను నోటాగా అమర్చారు. ఈ బటన్ నొక్కితే సదరు ఓటరు బరిలో ఉన్న అభ్యర్థులందర్ని తిరస్కరిస్తున్నట్లు అందులో ఫీడ్ అవుతుంది. అభ్యర్థులు నచ్చకపోయినా ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చి ‘నోటా’ బటన్ నొక్కాలని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.
దుమ్ము దులపండి
Published Wed, May 7 2014 2:37 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement