
నేటి నుంచి జగన్ జనభేరి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో జనభేరి పేరిట ఎన్నికల ప్రచారం మంగళవారం నుంచి నిర్వహించనున్నారు.
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో జనభేరి పేరిట ఎన్నికల ప్రచారం మంగళవారం నుంచి నిర్వహించనున్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించి, పలుచోట్ల ఏర్పాటుచేసిన సభల్లో ప్రసంగించనున్నారు.
మంగళవారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి నేరుగా గన్నవరం చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్‌షోగా గన్నవరంలోని మూడు బొమ్మల సెంటర్‌కు 10.30 గంటలకు చేరుకుని అక్కడ ఏర్పాటుచేసిన సభలో ప్రసంగిస్తారు. అనంతరం నియోజకవర్గంలో యాత్ర ముగించుకొని గుంటూరు వెళతారు.
ఈ నెల 30వ తేదీ బుధవారం గుంటూరు నుంచి నేరుగా కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గం చేరుకుని చల్లపల్లిలో రోడ్‌షో ప్రారంభిస్తారు. అక్కడినుంచి పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహిస్తూ ఉయ్యూరు చేరుకుంటారు. పలుచోట్ల ఏర్పాటుచేసిన సభల్లో ప్రసంగిస్తారు.
ఉయ్యూరు సభ అనంతరం విజయవాడ చేరుకుని రాత్రికి బస చేస్తారు. ఈ మేరకు టూర్ షెడ్యూల్ ఖరారు చేసినట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, పార్టీ ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ సోమవారం ఒక సంయుక్త ప్రకటనలో వివరించారు.
ఈ నెల ఒకటో తేదీ గురువారం జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో నిర్వహించే పర్యటన టూర్ షెడ్యూల్‌ను ఖరారు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న జనభేరి రోడ్‌షోను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.