బుడమేరు ముంపు సమస్యకు పరిష్కారం
సాక్షి, విజయవాడ : అదే జన హోరు.. అదే అభిమానం.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఆదివారం రాత్రి జననేత జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన వైఎస్సార్ జనభేరికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ముందుగా ప్రకటించిన దానికంటే నాలుగు గంటలు ఆలస్యంగా సభ ప్రారంభమైనా విసుగు చెందక.. అభిమాన నేతను కనులారా వీక్షించాలని.. గెలుపుపై పూర్తి మద్దతు ప్రకటించాలని.. ప్రతి ఒక్కరి కళ్లలో ఉప్పొంగిన ఉత్సాహం కనిపించింది.
సభ రాత్రి తొమ్మిది గంటల 15 నిమిషాలకు ప్రారంభమైనా జనం జననేత రాకకోసం ఎదురుచూశారు. ఆయన ప్రతి మాటకు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. భారీగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ రెండో పెద్ద నగరం. దీన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ‘నా తమ్ముడు వంగవీటి రాధా పార్టీలో చేరే సమయంలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ అంశాన్ని నా ముందుకు తీసుకొచ్చారు.
అప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డిగారు గజం వంద రూపాయలకు రిజిస్ట్రేషన్ చేశారని చెప్పారు. మేం అధికారంలోకి వస్తే గజం రూ.50 కే రిజిస్ట్రేషన్ చేస్తానని ఆ సభలో ప్రకటించాను. అది ఇంకా గుర్తుంది. దాన్ని నెరవేరుస్తా’ అని ప్రకటించారు. ‘విజయవాడ మున్సిపల్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు రావడం లేదు.
వారు జీతాలు సమయానికి ఇవ్వాలని కోరుతూ ఆందోళన చేస్తున్న సమయంలో నేను స్వయంగా వారి వద్దకు వెళ్లాను. వారు.. అన్నా మా జీతాలు గ్రీన్ ఛానల్ (010 పద్దు) ద్వారా ఇవ్వకపోవడం వల్ల జీతాల కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నామని అన్నారు. ఇది చాలా చిన్న సమస్య. దీని కోసం ఉద్యోగులను ఇంతకాలం వేధించడం సరికాదు. నెలరోజుల్లోనే వీరి సమస్యను పరిష్కరిస్తాను’ అని స్పష్టం చేశారు.
మరో మూడు రోజుల్లో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పార్టీ ఎంపీ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్, సెంట్రల్, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు పూనూరు గౌతంరెడ్డి, వంగవీటి రాధాకృష్ణ, జలీల్‌ఖాన్‌లను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ గుర్తును గుర్తుపెట్టుకుని ఓటేయాలని కోరారు.
మున్సిపల్ ఉద్యోగుల మద్దతు
తాము గత రెండేళ్లుగా ఆందోళన చేస్తున్నామని, ఇప్పటి వరకు జగన్‌మోహన్‌రెడ్డి తప్ప మరో నాయకుడు తమకు అండగా నిలబడలేదని మున్సిపల్ జేఏసీ నాయకుడు డి.ఈశ్వర్ అన్నారు. ఆదివారం సాయంత్రం తమ సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం సభలో జగన్‌మోహనరెడ్డి నెలరోజుల్లో మున్సిపల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని బహిరంగంగా హామీ ఇచ్చారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నట్లు మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది.