రేపు జగన్ జనభేరి
ఆస్పరి, పత్తికొండలో పర్యటన
సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జనభేరి కార్యక్రమం సోమవారం జిల్లాలో ప్రారంభం కానుంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జననేత సోమవారం సాయంత్రం ఆలూరు, పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం ప్రకటించారు.
కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆస్పరిలో సోమవారం సాయంత్రం మూడు గంటలకు బహిరంగ సభ ఉంటుందన్నారు. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు పత్తికొండకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారని వారు వెల్లడించారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొని జనభేరిని విజయవంతం చేయాలని కోరారు.