ఎన్డీయేకు మద్దతివ్వం: కేసీఆర్ | trs would never support to nda, say kcr | Sakshi
Sakshi News home page

ఎన్డీయేకు మద్దతివ్వం: కేసీఆర్

Published Sat, May 10 2014 1:46 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

ఎన్డీయేకు మద్దతివ్వం: కేసీఆర్ - Sakshi

ఎన్డీయేకు మద్దతివ్వం: కేసీఆర్

ప్రధానిగా రాహుల్‌కే ఓటు
యూపీఏకు రాకుంటే థర్డ్‌ఫ్రంట్‌కు చంద్రబాబుది ముగిసిన ‘కేసు’
న ఘర్ కా... న ఘాట్ కా
అక్కడ జగన్.. ఇక్కడ టీఆర్‌ఎస్
 
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి మద్దతివ్వబోమని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ సమావేశంలో చేసిన తీర్మానాలను, వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ‘సోనియాగాంధీ వల్లే తెలంగాణ బిల్లు పార్లమెంటులో నెగ్గింది. సోనియాగాంధీపై, రాహుల్‌గాంధీపై మాకు ఎలాంటి వ్యతిరేకతా లేదు. వాళ్లను నేను తిట్టలేదు. ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలూ చేయలేదు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియాపై సద్భావం ఉంది. అందుకు జీవితాంతం కృతజ్ఞులుగానే ఉంటం. యూపీఏ అధికారంలోకి వచ్చి, రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశముంటే మా మొదటి అడుగు యూపీఏ వైపే ఉంటది. లేకుంటే కాంగ్రెస్ కూడా థర్డ్ ఫ్రంట్‌కే మద్దతిస్తది. మేం కూడా థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్నం. టీఆర్‌ఎస్ పూర్తి రాజకీయ పార్టీ అని, రాజకీయ వ్యూహంతోనే పని చేస్తుందని ఇప్పటికే చెప్పినం. ఎన్నికల తర్వాత జరిగే పరిణామాలను బట్టి నిర్ణయం ఉంటది.
 
 ఎన్డీయేకు మాత్రం మద్దతివ్వం’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ‘‘కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటై, రాష్ట్రంలో మాత్రం జూన్ 2 దాకా రాజకీయ శూన్యత కొనసాగితే సమస్యలొస్తయి. తెలంగాణకు జరిగే నష్టం గురించి నేను ఆలోచిస్తున్నా. ఇది అర్థం కాని సన్నాసులు ఏదో మాట్లాడ్తరు. అపాయింటెడ్ తేదీని ముందుకు జరపాలన్న మా విజ్ఞప్తి న్యాయ శాఖ పరిశీలనలో ఉంది. మా వాదన సమంజసమని భావిస్తే తేదీని ముందుకు జరుపొచ్చు. హైకోర్టు సూచనలను కేంద్ర హోం శాఖ బుట్టదాఖలు చేసిందన్నట్టుగా ప్రచారం చేయడం సరికాదు’’ అన్నారు. ముఖ్యమంత్రి ఎవరు కావాలో టీఆర్‌ఎస్ శాసనసభాపక్షం సమావేశమై నిర్ణయిస్తుందన్నారు.
 
 పంపకాలపై ప్రతిపాదనలే...
 
 సచివాలయం, అసెంబ్లీ భవనాలు తదితరాల పంపకాల విషయంలో జరుగుతున్నవన్నీ ప్రతిపాదనలు మాత్రమేనని కేసీఆర్ అన్నారు. ‘‘కానీ అవన్నీ పూర్తయినట్టు వార్తలు రాస్తున్నరు. ఇది అవగాహనారాహిత్యమే. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటైనంక ఇద్దరు సీఎం కూర్చుని పంపకాలు చేసుకుంటరు. అప్పటిదాకా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తరు. పరస్పర అంగీకారంతోనే పంపకాలు జరుగుతాయని ఎస్సార్సీ చట్టం చెబుతోంది. అప్పటిదాకా రెండు రాష్ట్రాలకు తాత్కాలిక ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత గవర్నరు మీద ఉంటది గనుక దాన్ని ఆయన నిర్వహిస్తున్నరు. రెండు రాష్ట్రాలకు వేర్వేరు భవనాల్లో ఏర్పాట్లు చేయాలని, ఉద్యోగులకు ఆప్షన్లు ఉండకూడదని టీఆర్‌ఎస్ విధానం. దాన్నే గవర్నరుకు చెబుతున్నం. వింటరో లేదో ఆయనిష్టం’’ అన్నారు. హైదరాబాద్‌లో సచివాలయం ఉండదని, అవసరమైతే చెట్ల కిందే పని చేద్దామని ఆంధ్రప్రదేశ్ నేతలు చెప్పారని గుర్తు చేశారు.
 
 ఆంధ్రప్రదేశ్‌కు జగనే సీఎం
 
 ‘‘నేను చేయించుకున్న సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు సీఎం జగనే. అది చాలా స్పష్టం. 101 శాతం చెబుతున్నా. ఆంధ్రప్రదేశ్‌కు సీఎం జగనే. వైఎస్సార్ కాంగ్రెస్‌కు వంద స్థానాలకు పైగా వస్తయి. జగన్ అంటే అంటరాని పదార్థమా? తమాషాగా ఉందా? కొందరికి అలాంటి అభిప్రాయాలుంటే వాళ్లిష్టం. మా వరకైతే శషభిషలేమీ లేవు. పక్కరాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌ను గౌరవిస్తం. అక్కడ జగన్ సీఎం అయితే ఇక్కడ టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తది. టీఆర్‌ఎస్ బాధ్యత కలిగిన పార్టీ. తెలుగు మాట్లాడే ప్రజల కష్టాలపై అవగాహన ఉంటే సమస్యలను కలిసి పరిష్కరించుకోవాలి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి చాలా సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంటది. ఇద్దరు సీఎంలు సమన్వయంతో పని చేయాల్సి ఉంటది. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడమా? అట్లనే ఆంధ్రప్రదేశ్ సీఎంతోనూ మాట్లాడి సమన్వయం చేసుకుంటం. ఓడల ద్వారా ఎగుమతులు అవసరమైతే ఆంధ్రప్రదేశ్ సీఎంతో మాట్లాడుతం’’ అని కేసీఆర్ అన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ముగిసిన కథ (గాన్ కేస్)గా అభివర్ణించారు. ‘‘బాబు పరిస్థితి దోబీ కా కుత్తా న ఘర్ కా, న ఘాట్ కా అన్నట్టుగా పరిస్థితి ఉంది. చంద్రబాబు అవసరమే ప్రజలకు లేదు. అటు ఆంధ్రాలోనూ, ఇటు తెలంగాణలోనూ ఆయనకు దిక్కు లేకుండా పోయింది. అందుకే సింగపూర్‌కు పోయినట్టున్నడు’’ అంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు.
 
 తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి
 
 వడగండ్లు, అకాల వర్షాల వల్ల తెలంగాణ రైతులు తీవ్రంగా దెబ్బ తిన్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన పంటలను గవర్నర్ పరిశీలించాలని, రైతులను ఆదుకోవాల్సిందిగా వ్యవసాయ, రెవెన్యూ శాఖలను ఆదేశించాలని కోరారు. ఈ మేరకు తీర్మానం చేసినట్టు వెల్లడించారు.
 
 కడుపు, నోరు కట్టుకోండి: కేసీఆర్ ఉద్బోధ
 
 అధికారంలోకి వస్తున్న పార్టీ నేతలుగా రాజకీయ అవినీతికి పాల్పడకుండా స్వచ్ఛంగా ఉండాలని టీఆర్‌ఎస్ నేతలకు కేసీఆర్ ఉద్బోధించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ భేటీలో పార్టీ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులను ఉద్దేశించి ఆయన 40 నిమిషాల పాటు మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు కడుపు, నోరు కట్టుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. టీఆర్‌ఎస్ పట్ల ప్రజలు అనుకున్న దానికంటే రెండు మూడు రెట్లు ఎక్కువగా ఆదరణ చూపించారన్నారు. మెజారిటీ స్థానాలు తమవేనని ధీమా వెలిబుచ్చారు. ఓడేవారు, పోటీకి అవకాశం రానివారు బాధ పడాల్సిన పని లేదన్నారు. అధికారంలోకి వచ్చాక అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్ పదవుల విషయంలో అవసరమైతే ఎంఐఎంకు మద్దతివ్వడం, తీసుకోవడం వంటివి చేయాలని సూచించారు.
 
 స్థానిక ఎన్నికల్లో అవసరమైతే టీడీపీ వారిని తీసుకోండి. గెలిచిన మనవారిని కాపాడే బాధ్యతను ఎమ్మెల్యేలే తీసుకోవాలి. స్థానిక ఎన్నికల ఫలితాలు అయిపోగానే సంబరాలు చేసుకోవాలి. 16న సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు అయిపోగానే గెలిచే మనవాళ్లంతా 17న తెలంగాణ భవన్‌కు రావాలె. భావి కార్యాచరణపై ఆ రోజే నిర్ణయం తీసుకుందాం. గెలిచే మన ఎంపీలంతా నేరుగా ఢిల్లీకి వెళ్తారు. జాతీయ రాజకీయాల్లో ఏ వైఖరి అనుసరించాలనే దానిపై కేకేతో సమన్వయం చేసుకుని నిర్ణయం తీసుకుందాం’’ అన్నారు. మెదక్‌లో టీఆర్‌ఎస్‌కు 8 అసెంబ్లీ స్థానాలు వస్తాయని, ఆ జిల్లాలోని మంత్రులంతా ఓడిపోతున్నారని చెప్పారు. గజ్వేల్‌లో తాను 50 వేల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు వంటి మంత్రులంతా ఓడిపోతున్నారన్నారు. ‘‘వరంగల్‌లో 10, ఆదిలాబాద్‌లో 10, నిజామాబాద్‌లో 9, కరీంనగర్‌లో 11 అసెంబ్లీ స్థానాలు కూడా టీఆర్‌ఎస్‌వే. వీటితో పాటు రంగారెడ్డి జిల్లాలో వచ్చే సీట్లతోనే అధికారం ఖాయం. ఇక నల్లగొండ, మహబూబ్‌నగర్, జంట నగరాల్లో వచ్చే సీట్లన్నీ బోనసే’’ అన్నారు. కేసీఆర్ శుక్రవారం రాత్రి టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు నివాసానికి వెళ్లారు. జాతీయ పరిణామాలు, మూడో ఫ్రంట్ అవకాశాలపై చర్చించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement