తెలంగాణపై కాంగ్రెస్‌ది కుట్ర.. కేసీఆర్‌ది అత్యాశ | bjp leader Sushma Swaraj fire to congress ,trs | Sakshi
Sakshi News home page

తెలంగాణపై కాంగ్రెస్‌ది కుట్ర.. కేసీఆర్‌ది అత్యాశ

Published Sun, Apr 27 2014 3:08 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

తెలంగాణపై   కాంగ్రెస్‌ది కుట్ర.. కేసీఆర్‌ది అత్యాశ - Sakshi

తెలంగాణపై కాంగ్రెస్‌ది కుట్ర.. కేసీఆర్‌ది అత్యాశ

కేసీఆర్ కలలు కల్లలే... ఆయన సీఎం కాలేరు ...కేంద్రమంత్రీ కాలేరు
కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఖాయం
తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్‌ది ద్వంద్వ వైఖరి
మరిచిపోయికూడా హస్తానికి ఓటె య్యవద్దు 
నర్సాపూర్, చౌటుప్పల్, హన్మకొండల్లో
భారత్ విజయ్‌ర్యాలీలో సుష్మాస్వరాజ్
బీజేపీతోనే తెలంగాణ, ఆంధ్ర అభివృద్ధి
{పాణహిత చేవెళ్లకు జాతీయ హోదా కల్పిస్తాం
తెలంగాణ మాగాణాలను సస్యశ్యామలం చేస్తాం

 
 సంగారెడ్డి, వరంగల్, చౌటుప్పల్: ‘టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ అనిశ్చితిలో కూరుకుపోయారు. అందుకే ఆయన లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడితే సీఎం అవుదామని, లేకుంటే కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో మంత్రి పదవి పొందాలని కలలు కంటున్నారు. ఆయన తెలంగాణ రాష్ట్రంలో సీఎం కాలేరు. కేంద్రంలో మంత్రీ కాలేరు. కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటయితే ఆయన చూస్తుండిపోవడం ఖాయం..’ అని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు, బీజేపీ అగ్రనేత సుష్మా స్వరాజ్ అన్నారు. శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్, వరంగల్ జిల్లా హన్మకొండ, నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌ల్లో ‘భారత్ విజయ్‌ర్యాలీ’ పేరుతో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆమె మాట్లాడారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను, కాంగ్రెస్‌ను తీవ్రపదజాలంతో విమర్శించారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ మోసంచేయడానికి యత్నించిందని,రెండునాల్కలతో వ్యవహరించిందని ఆమె ధ్వజమెత్తారు. రెండు ప్రాంతాలవారినీ మభ్యపెట్టి ఓట్లు కొల్లగొట్టేందుకు పథకం వేసిందన్నారు.

అయితే తాము ఈ పన్నాగాన్ని గమనించి తెలంగాణకు మద్దతు తెలిపి, కాంగ్రెస్ ఎత్తుగడలు తిప్పికొట్టామని  స్పష్టం చేశారు. మరిచిపోయి కూడా కాంగ్రెస్‌కు ఓట్లు వేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌ను బాధ్యతారాహిత్య నేతగా అభివర్ణించారు. ఆయన మాట్లాడే భాష సరిగా ఉండదని సుష్మా ఆరోపించారు. హైదరాబాద్‌లో ఉండే సీమాంధ్రలు వెళ్లాలని, సాగునీరు ఇవ్వబోమని మాట్లాడడం సరికాదని అన్నారు. సీమాంధ్రకు నదీ జలాలను నిలిపివేసి అక్కడి ప్రజలను దాహంతో ఉంచుతామని కేసీఆర్ అంటున్నారని, కృష్ణా, గోదావరి నదుల నుంచి వృథాగా సముద్రంలో కలుస్తున్న  నీళ్లను ఆపి రెండుప్రాంతాల ప్రజలకు అందించాలని తమ పార్టీ కోరుకుంటోందని ఆమె స్పష్టం చేశారు.  ఇద్దరు సోదరుల వేర్పాటులా తెలంగాణ నిర్మాణం ఉండాలన్నదే బీజేపీ అభిమతమన్నారు. ఒక్క రక్తం బొట్టు చిందించకుండానే బీజేపీ గతంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్‌ను, బీహార్ నుంచి జార్ఖండ్‌ను, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్‌ను వేరు చేసిందన్నారు.
 
కాంగ్రెస్ కుట్రను తిప్పికొట్టాం


 పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు ఆమోదం పొందడానికి తీవ్ర ప్రతికూలత నెలకొన్న సమయంలో కాంగ్రెస్ బిల్లును ప్రవేశపెట్టిందన్నారు. బిల్లుకు ఆమోదం లభించదనుకుందన్నారు. ప్రతిపక్షాల వైఖరి వల్లే బిల్లు పాస్ కాలేదని తెలంగాణ ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ యోచించిందన్నారు. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినా ఆమోదం పొందకుండా అడ్డుకున్నామని సీమాంధ్ర ప్రజలకు చెప్పుకుందామనున్నారు.రెండు ప్రాంతాల్లో ఓట్లు, సీట్లు రాబట్టుకోవాలనుకున్నారు, కానీ ఈ విషయం  పసిగట్టిన తాము తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య బిల్లుకు మద్దతు తెలిపి గట్టెక్కించామని సుష్మా వివరించారు. చర్చకు అనుకూల వాతావరణం లేకున్నా మద్దతిచ్చి, బిల్లు ఆమోదించామన్నారు. కొత్తరాష్ట్రాల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రజల మధ్య ఘర్షణ, విద్వేషాలు రగిలేలా వ్యవహరించింది. బీజేపీకి ఉన్న స్పష్టమైన విధానం.. కాంగ్రెస్‌కు లేకపోవడం వల్లే ఇలా జరిగిందన్నారు. చివరకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో ఢిల్లీలో ధర్నాలు, ఆందోళనలు ప్రోత్సహించి, మరో కుట్ర చేసిందన్నారు. అయితే, పార్లమెంట్‌లో గత్యంతరం లేక బిల్లును  ఆమోదింపజేసిందన్నారు.

 బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి

 తెలంగాణ విషయంలో బీజేపీ దృఢంగా వ్యవహరించిందని సుష్మా  తెలిపారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను అభివృద్ధి చేసే సామర్థ్యం బీజేపీకే ఉంది. తెలంగాణలో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేస్తాం. కాకతీయ కాలువ రెండు, మూడో దశలను పూర్తి చేసి తాగునీరు, సాగునీరు అందిస్తాం. రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణగా మారుస్తాం. వ్యవసాయ సమస్యలను పరిష్కరిస్తాం. తెలంగాణలో యువకులకు ఉపాధి కల్పిస్తాం’అని తెలిపారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న దాశరథి కవితలను ఆమె ప్రస్తావించారు. పోతన గొప్పదనాన్ని, కాకతీయుల హయూంలో మెరుగైన సాగునీటి వ్యవస్థ గురించి మాట్లాడారు. సుష్మా ప్రసంగాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు తెలుగులోకి అనువదించారు.
 
రెంటికీ చెడ్డ రేవడివి అవుతావు


 ‘కేసీఆర్ నువ్వు....గజ్వేల్ అసెంబ్లీకి, మెదక్ పార్లమెంట్‌స్థానానికి పోటీ చేస్తున్నావు, కాలం కలిసొచ్చి టీఆర్‌ఎస్ పార్టీ అవసరమైన ఎమ్మెల్యే స్థానాలను గెలిస్తే ముఖ్యమంత్రివి కావాలనుకుంటున్నావు.. ఒకవేళ సీఎంవి కాలేకపోతే, ఎంపీగా కేంద్రంలో మంత్రి పదవి చేపట్టాలనుకుంటున్నావు.. చివరకు రెంటికీ చెడ్డ రేవడివి అవుతావని’  సుష్మాస్వరాజ్ అన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా ప్రజల మధ్య ఎలాంటి విద్వేషాలు సృష్టించలేదన్నారు. కేసీఆర్ మాత్రం తెలంగాణ నుంచి గెంటేస్తామని, నీరివ్వమని హెచ్చరికలు జారీ చేయడం సరికాదన్నారు. సంగారెడ్డి సభలో పార్టీ మెదక్ లోక్‌సభ అభ్యర్థి చాగండ్ల నరేంద్రనాథ్‌తో పార్టీ మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కె బుచ్చిరెడ్డి, అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు పాల్గొన్నారు.
 
సుష్మా ఇంకా ఏమన్నారంటే....


రెండు రాష్ట్రాలుగా ఉన్నా తెలుగు ప్రజలు కలిసి ఉండాలి. ఒకే జాతిగా అభివృద్ధి చెందాలి. కాంగ్రెస్ పాలన అంతా లంచగొండితనం, కుంభకోణాల మయం. ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైనందుకు ఆనందంగా ఉంది. దేశానికి 1947లో స్వాతంత్య్రం వస్తే తెలంగాణకు ఏడాది తర్వాత 1948 సెప్టెంబర్ 17న వచ్చింది.ఇన్నేళ్లకు తెలంగాణ ఏర్పాటుతో ఇక్కడి ప్రజలకు న్యాయం జరిగింది. అయితే, ఓ ఆరునెలల ముందే రాష్ట్రం ఏర్పడితే, వేర్వేరు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగేవి. ప్రజలమధ్య ఇంత గందరగోళం ఉండకపోయేది.సీమాంధ్ర ప్రజలను ఒప్పించడానికే ఇంత ఆలస్యం జరిగిందని ఇక్కడికి వచ్చినప్పుడు ఏఐసీసీ అధినేత్రి సోనియా చెప్పారు. ఇది పూర్తిగా అసత్యం.ఆంధ్రప్రజలను కాంగ్రెస్ పార్టీ ఒప్పించిందా?, అసలు ఆ పార్టీ అధిష్టానం తమ సీఎంనే ఒప్పించలేకపోయింది.తెలంగాణలో 1100 మంది ఆత్మహత్యలకు కాంగ్రెస్‌దే బాధ్యత. మరిచిపోయి కూడా కాంగ్రెస్‌కు ఓటేయవద్దు.
 
హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణ బాధ్యత బీజేపీదే

,హైదరాబాద్: తెలంగాణను నాన్చినాన్చి 1,100 మంది యువకుల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్సే తెలంగాణ విలన్ అని సుష్మాస్వరాజ్ ఆరోపించారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని గోషామహాల్ జుమ్మెరాత్‌బజార్ వద్ద జరిగిన బీజేపీ భాగ్యనగర్ మహాగర్జనలో ఆమె ప్రసంగించారు. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది బీజేపీయేన న్నారు. యూపీఏ ప్రభుత్వం కుంభకోణాలు, ధరల పెరుగుదలతో ప్రజలకు నరకం చూపించిందన్నారు. హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు పూర్తి రక్షణ కల్పించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. మజ్లిస్‌పార్టీ 30 ఏళ్లుగా హైదరాబాద్‌లో మతం పేరు చెప్పి ఓట్లు దండుకుంటోందని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తుగా ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. పాకిస్తాన్ సైని కులు, ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి మన సైనికుల తలలు నరికేసినా నిరోధించలేని యూపీఏ ప్రభుత్వం చేతకానిదని సుష్మా విమర్శించారు. బంగారు భవిష్యత్ కోసం  బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి భగవంతరావును, గోషామహాల్  ఎమ్మెల్యేగా రాజాసింగ్ లోధాను గెలిపించాలని ఆమె కోరారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement