వరుణ్‌గాంధీకి తల్లి మేనకాగాంధీ హితవు
పిలిభిత్(యూపీ): ఏదైనా మాట్లాడేముందు హృదయాన్ని కాదు.. బుద్ధికుశలతను ఉపయోగించాలని తన కుమారుడు వరుణ్‌గాంధీకి ఆయన తల్లి, బీజేపీ నేత మేనకాగాంధీ గురువారం సలహా ఇచ్చారు. వరుణ్ తన పెదనాన్న కుమారుడైన రాహుల్‌గాంధీని ప్రశంసించడాన్ని ఆమె తప్పుపట్టారు. అమేథీలో అభివృద్ధి గురించి తన కుమారుడు చేసిన వ్యాఖ్యలు సరికాదని పేర్కొంటూ ఆమె పై విధంగా హితవు పలికారు. అమేథీలో గడిచిన 45 ఏళ్లుగా ఏ విధమైన అభివృద్ధి జరగలేదని ఆమె వ్యాఖ్యానించారు. అయితే ఈ సందర్భంగా మేనకాగాంధీ తన కుమారుడ్ని వెనకేసుకొచ్చారు. వరుణ్ అమాయకుడని, అతని హృదయం ఎలాంటి కల్మషం లేనిదని చెప్పారు. యూపీలోని సుల్తాన్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న వరుణ్ గత మంగళవారం ఓ ఉపాధ్యాయ బృందాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ స్వయంసహాయక సంఘాల ద్వారా తన నియోజకవర్గం అమేథీలోని మహిళల సాధికారతకు చక్కగా కృషి చేస్తున్నారంటూ ప్రశంసలు కురిపించడం తెలిసిందే.