ఓటుకు నోటు! | Vote for money in elections | Sakshi
Sakshi News home page

ఓటుకు నోటు!

Published Fri, Apr 11 2014 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 5:51 AM

ఓటుకు నోటు!

ఓటుకు నోటు!

సాక్షి ప్రతినిధి, కర్నూలు: అడక్కుండానే ఇంటికి ఓ బాయిలర్ కోడి, మద్యం సీసా పంపిణీ చేశారు.. అలాగే  చీర, జాకెట్ కూడా ఇచ్చారు. ఓటుకు రూ.300 నుంచి రూ.500 ప్రకారం అందించారు.. ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో టీడీపీ నాయకుల ప్రలోభాల పర్వమిది. తామేమీ తక్కువ తినలేదన్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం.. ఓటర్లకు కర్ణాటక మద్యం సీసాలతో ఎర వేస్తున్నారు. జిల్లాలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు శుక్రవారం ఆదోని రెవెన్యూ డివిజన్‌లో జరుగనున్నాయి.

 ఓటమి భయంతో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. గురువారం రాత్రి  విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేశారు. జిల్లాలోని ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల పరిధిలో ప్రలోభాలు తారాస్థాయికి చేరాయి. మొదటి విడత ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నామని తెలుసుకున్న తమ్ముళ్లు రెండో విడతలోనైనా పరువు నిలుపుకోవాలని అడ్డదారులు తొక్కారు.

అదే విధంగా ఆలూరు నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ నాయకులు కూడా పరువు కాపాడుకోవటానికి నానా తంటాలు పడుతున్నారు. అందులో భాగంగానే ఈ రెండు పార్టీలు గురువారం అర్ధరాత్రి దాటాక కూడా నగదు, చీరలు, కుంకుమ బరిణెలు, మద్యం బాటిళ్లను పంపిణీ చేశారు. ఓటుకు రూ.300 నుంచి రూ. 1,500, రూ.2 వేలు వరకు పంపిణీ చేశారు.

కొన్ని చోట్ల మహిళలకు చీరలు, బొట్టు బిళ్లలు, గాజులు పంపిణీ చేయటం కనిపించింది. పురుష ఓటర్లకు డబ్బులతో పాటు మద్యం బాటిళ్లను ఇచ్చారు. తాగిన వారికి తాగినంత పంపిణీ చేసి ఓటేయమని ప్రాధేయపడ్డారు. కొన్నిచోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను బెదిరించారు. ఓటేయకపోతే నీ అంతు చూస్తామంటూ హెచ్చరికలు చేశారు. తమ అభ్యర్థులు గెలిస్తే ‘మీకు ఏం కావాలన్నా చేస్తాం.. రుణాలన్నీ మాఫీ చేస్తాం... ఇళ్లు కట్టిస్తాం.. తిరిగి రుణాలు ఇస్తాం’ అంటూ ఉత్తుత్తి హామీలు గుప్పిస్తూ ఓటర్లను ప్రాధేయపడ్డారు.
 
 ఏరులై పారిన కర్ణాటక మద్యం.
 ఎన్నికలకు ముందు మద్యం దుకాణాలను మూసివేయటంతో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు కొందరు కర్ణాటక నుంచి దిగుమతి చేసుకున్నారు. మరి కొందరు నాటుసారా తయారు చేసి విచ్చలవిడిగా పంపిణీ చేశారు.  ఇలా ఓటర్లను రకరకాల ప్రలోభాలకు గురిచేస్తూ ఓట్లను రాబట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొన్ని గ్రామాల్లో టీడీపీ నేతలు మద్యం తాగించి ప్రత్యర్థుల నివాసాల ముందు దుర్భాషలాడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటంతో ఆలూరు నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాల ప్రజలు రాత్రంతా జాగారం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement