బీజేపీకి నిరాశ తప్పదు
న్యూఢిల్లీ: గత ఎన్నికల్లో మాదిరే ఈసారి కూడా బీజేపీకి వైఫల్యం తప్పదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. ఘజియాబాద్‌లోని గంగాగఢ్‌లో శనివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ ఆయన ఈ మాటన్నారు. ‘దేశం వెలిగిపోతోందంటూ బీజేపీ 2004 ఎన్నికలకు ముందు ఊదరగొట్టింది. ఓటర్లను మాత్రం మెప్పించలేకపోయింది. బీజేపీ ప్రచారం ధూమ్ సినిమాల మాదిరిగా ఉంది. ఒకటి విఫలమైతే మరొకదాన్ని ప్రయత్నిస్తున్నారు. 2004లో వెలిగిపోతుందన్నారు.
అది విఫలమైంది. 2009లో అదే మాట అన్నారు ఓడిపోయారు. మేం మాత్రం 2009లో రైతుల రుణాలు రద్దు చేశాం. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేశాం. ప్రజలు ఎప్పట్లాగే బీజేపీకి గుణపాఠం చెప్పారు’ అని విమర్శించారు. ఈసారి బీజేపీ ప్రచారకర్తలు కొత్త సినిమా విడుదల చేస్తున్నారని, దానిపేరే ‘గుజరాత్ నమూనా’ అని ఎద్దేవా చేశారు. యూపీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ సందర్భంగా రాహుల్ వివరించారు. చేతివృత్తుల కళాకారులు, ట్రక్కు డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్ల వంటి పేద, నిరుపేద కుటుంబాల కోసం తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని వివరించారు. ‘మేం పేదలను మరిచిపోము.
మనదేశంలోని 70 కోట్ల మంది పేదలను 5-10 ఏళ్ల కాలంలో మధ్యతరగతిస్థాయికి తీసుకువస్తాం. భారత విద్యావ్యవస్థను మార్చడం ద్వారా దీనిని చేసి చూపిస్తాం. ప్రత్యర్థి పార్టీ మాత్రం ఒకే వ్యక్తికి అధికారం ఉంటే చాలనుకుంటోంది. మేం మాత్రం భారతీయులందరికీ సాధికారత ఉండాలని కోరుకుంటున్నాం’ అని రాహుల్‌గాంధీ వివరించారు. కాంగ్రెస్ నాయకులకు ప్రేమ, సోదరభావమే తెలుసని, ఆగ్రహావేశాలకు వాళ్లు దూరంగా ఉంటారని అన్నారు.
నేడు సోనియా ర్యాలీ
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ర్యాలీ ఆదివారం కరోల్‌బాగ్‌లోని అజ్మల్‌ఖాన్ పార్కులో జరగనుంది. ఇందుకోసం ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ భారీ ఎత్తున ఏర్పాట్లుచేస్తోంది. అజ్మల్‌ఖాన్ పార్కులో 1979లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ర్యాలీ నిర్వహించారు. 35 సంవత్సరాల తరువాత మరోమారు కాంగ్రెస్ అధ్యక్షురాలు అజ్మల్‌ఖాన్ పార్కులో ప్రసంగించనున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ పార్కులో 20 వేల మంది కూర్చోవచ్చు. అయితే సోనియా సభకు 40 వేల మంది హాజరయ్యేలా చూడాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. పార్కు వెలుపల ఎల్‌సీడీ స్క్రీన్లను ఏర్పాటుచేయడం ద్వారా వీలైనంత ఎక్కువ మందికి సోనియా ప్రసంగం వీక్షించే అవకాశం ఉందని అంటున్నారు.
ఇరవై అడుగుల వేదికపై నుంచి సోనియా గాంధీ ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ, శాసనసభాపక్ష నేత హరూన్ యూసఫ్‌తోపాటు పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ సోనియా గాంధీతోపాటు వేదికపై కూర్చుంటారు. ఆరు లోక్‌సభ స్థానాల నుంచి పోటీచేసే అభ్యర్థులు, సీనియర్ నాయకులు మరో వేదికపై కూర్చుంటారు. రాహుల్ గాంధీ ఏప్రిల్ 6న ర్యాలీ నిర్వహిస్తారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఇప్పటికే రాజధానిలో ర్యాలీ నిర్వహించగా, ఏప్రిల్ ఏడున మరో ర్యాలీ జరుపనున్నారు. అద్వానీ, సుష్మాస్వరాజ్, అరున జైట్లీ ర్యాలీలు కూడా త్వరలో జరుగనున్నాయి. బీఎస్పీ నేత మాయావతి కూడా ఏప్రిల్ వచ్చేవారం నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిసింది.