పెరిగిన ఓట్ల శాతం మోడీకి అనుకూలమేనా?
పెరిగిన ఓట్ల శాతం మోడీకి అనుకూలమేనా?
Published Sat, May 3 2014 1:11 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
ఈ సారి లోకసభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. ఏప్రిల్ 30 వరకూ 438 లోకసభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఈ నియోజకవర్గాల్లో సగటున గత ఎన్నికలకంటే కనీసం ఎనిమిది శాతం అదనపు పోలింగ్ జరిగింది. ఈ అధికపోలింగ్ శాతం దేన్ని సూచిస్తోంది? బిజెపి వర్గాలు, ఎన్డీఏ వర్గాలు చెప్పుకుంటున్నట్టుగా వారికి అనుకూలంగా ఏదైనా భారీ వేవ్ ఉందా? ఈ అదనపు ఓట్లన్నీ యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పడతాయా? గతానుభవాలు ఏం చెబుతున్నాయి?
ఓటింగ్ పెరిగితే ప్రభుత్వం మారుతుందా?
* ఇప్పటి వరకూ దేశంలో అయిదు ఎన్నికల్లో ఒక పక్షం లేదా కూటమికి భారీ వేవ్ కనిపించింది. అవి 1977 ఎన్నికలు, 1984 ఎన్నికలు, 1989 ఎన్నికలు, 1999 ఎన్నికలు, 2004 ఎన్నికలు. 1977 లో ఎమర్జెన్సీ వ్యతిరేక ఓటు పడింది. తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. 1984 లో ఇందిరా గాంధీ హత్యానంతరం ఎన్నికలు జరిగాయి. 1989 లో బోఫోర్స్ కుంభకోణం నేపథ్యంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. 1999 లో వాజ్ పేయి వేవ్ ఎన్నికలను ప్రభావితం చేసింది. 2004 లో ఎన్డీయే ఓడి, యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది.
ఓటింగ్ పెరిగినా అధికారపక్షమే గెలిచింది
* చరిత్రను మార్చిన ఈ అయిదు ఎన్నికల్లో మూడు ఎన్నికలు 1989, 1999, 2004 లో అంతకు ముందరి ఎన్నికల పోలింగ్ శాతం కన్నా తక్కువ వోట్లు పోలయ్యాయి. ఓటరు ఊపు కనిపించలేదు. కానీ ఈ మూడు సార్లూ ప్రభుత్వాలు మారాయి. అంటే ఓట్ల శాతానికి , ప్రభుత్వాల మార్పిడికి ఎలాంటి సంబంధమూ లేదు.
అత్యధిక ఓటింగ్ శాతం - అయినా అధికార పక్షానికే పట్టం
* చరిత్ర మార్చిన 1984 ఎన్నికల్లో 12 శాతం అదికంగా ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో ప్రభుత్వం మారలేదు. అధికారంలో ఉన్న పార్టీయే మళ్లీ గెలిచింది. దేశ చరిత్రను మార్చిన 1977 ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడింది. కానీ ఓట్లు మాత్రం అంతకు ముందరి ఎన్నిక కన్నా 4 శాతం మాత్రమే పెరిగాయి.
కాబట్టి ఎన్నికల్లో భారీగా పోలింగ్ జరిగినంత మాత్రాన ప్రభుత్వాలు మారిపోతాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ లేవు. కొందరు నిపుణులు చెబుతున్నట్టు ఇది మోడీ అనుకూల వోటు అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.
Advertisement
Advertisement