రెండు నెలల్లో రాజన్న రాజ్యం
పిఠాపురం, న్యూస్‌లైన్:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం పిఠాపురంలో నిర్వహించిన రోడ్‌షోలో అడుగడుగునా జనం నీరాజనం పలికారు. పలువురు వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులు, మహిళలను ఆయన పలకరించి వారి సమస్యలను సావధానంగా విని వారికి ధైర్యం చెప్పారు. వైఎస్సార్ సీపీకి ఓటువేసి గెలిపించండి, మీకు నేను అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు.
అన్నా నోరు లేదు దారి చూపించు
అన్నా మాకు ఏది అడగాలన్నా నోరు లేదు. నీవే మాకు దారి చూపించాలి అంటు పిఠాపురం ఏడో వార్డుకు చెందిన ఎం. రామిరెడ్డి, ఎం. దుర్గాభవానిసైగలతో జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించుకున్నారు.
వారిని ఆప్యాయంగా దగ్గరకు రమ్మని వారి వివరాలు అడగగా పక్కనున్న వారు వారి గురించి చెప్పడంతో ఆయన స్పందించి తప్పక సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. వారికి ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా పిఠాపురం వైఎస్సార్ సీపీ కన్వీనర్ పెండెం దొరబాబును ఆదేశించారు.
కన్నులేదు ... ఆరోగ్యశ్రీకార్డు ఇప్పించండి
ఒక కన్ను చూపుకోల్పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నాకు ఆరోగ్యశ్రీ కార్డు లేదు. దానికోసం చాలా కాలంగా ఎందరి చుట్టూనో తిరిగాను. మీరే నాకు ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పించాలంటూ నాల్గో వార్డుకు చెందిన రాయుడు రమణకుమారి భోరుమంది. అన్ని సమస్యలు తీరతాయని, నీకు తప్పకుండా రెండుకళ్లు బాగుండేలా చూస్తామని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పడంతో ఆమె ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది.
కార్మికులకు అండగా ఉంటా కష్టాల కడలిలో ఉన్న కార్మికులను ఆదుకోవడానికే వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించిందని జగన్‌మోహన్‌రెడ్డి కార్మికులకు భరోసా ఇచ్చారు. పిఠాపురం ఐదో వార్డులో భవననిర్మాణ కార్మికులను పలకరించిన జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్‌సీపీని గెలిపించడానికి అందరు కృషి చేయాలని రెండు నెలల్లో మన ప్రభుత్వం వస్తుందని కార్మికుల సమస్యలు అన్ని తీరతాయన్నారు.
వెండి ఫ్యాను బహుకరణ
తన అభిమాన నాయకుడిని స్వయంగా కలుసుకోవాలనే తపన ఉన్నా అనారోగ్యరీత్యా కదలలేని స్థితిలో ఉన్న తండ్రికి ఫోన్‌లో పరామర్శించాలని పిఠాపురానికి చెందిన దామి సుబ్రహ్మణ్యం జగన్‌మోహన్‌రెడ్డిని కోరగా వెంటనే ఆయన ఫోన్‌లో ఆస్పత్రిలో ఉన్న తన అభిమానితో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకుని తప్పక మీరు ఆరోగ్యవంతుడిగా ఉంటారని ధైర్యం చెప్పారు.
తమ అభిమానానికి గుర్తుగా తాను తయారు చేసిన వెండి ఫ్యానును జగన్‌కు బహూకరించగా ఆయన దానిని ఆనందంతో స్వీకరించారు.
అన్నా నన్ను కాపాడు రెండుకాళ్లు చచ్చుబడి అచేతన స్థితిలో ఉన్న పిఠాపురానికి చెందిన పొన్నాడ రమాదేవి అనే వికలాంగురాలి వివరాలు రోడ్డుషోలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి తెలుసుకుని ఆయన ఆమె ఇంట్లోకి వెళ్లి పరామర్శించి ఏపరిస్థితుల్లో అలా జరిగిందో తెలుసుకున్నారు.
వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే నీఆరోగ్యం కుదుటపడేలా చూస్తానని, అధైర్య పడవద్దని ఆయన భరోసా ఇవ్వడంతో ఆకుటుంబీకులు ఆనందపరవశులయ్యారు.