నారీ.. చైతన్య భేరి
సీమాంధ్రలో ఓటు వేసిన వారిలో మహిళలే అధికం
97 స్థానాల్లో మహిళల పోలింగ్ అధికం
గ్రామీణ ప్రాంతాల్లో భారీ పోలింగ్.. 85 శాతం దాటిన ఓటింగ్
ఆసక్తి చూపని పట్టణ ఓటర్లు.. 60 శాతం లోపే పోలింగ్
ప్రకాశం జిల్లా దర్శిలో అత్యధికంగా 90.96 శాతం పోలింగ్
నెల్లూరు నగర నియోజకవర్గంలో 56.38 శాతం అతి తక్కువ ఓట్లు
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో జరిగిన సార్వత్రిక ఎన్నిలక పోలింగ్‌లో మహిళా చైతన్యం వెల్లివిరిసింది. 13 జిల్లాల్లో బుధవారం జరిగిన పోలింగ్‌లో పురుషులకంటే మహిళలే ఎక్కువ మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. మరోపక్క ఓటు హక్కు వినియోగం విషయంలో పట్టణ ఓటర్లలో స్తబ్దత నెలకొనగా, గ్రామీణ ఓటర్లు పోటెత్తారు. పట్టణ, నగర ప్రాంతాల్లోని నియోజకవర్గాలకంటే గ్రామీణ స్థానాల్లో పోలింగ్ శాతం చాలా అధికంగా ఉంది. ఓటు విలువపై గ్రామీణ, మహిళా ఓటర్లలో పెరిగిన చైతన్యానికి ఇది నిదర్శనంగా చెప్పవచ్చు. సీమాంధ్రలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా, పోలైన ఓట్లలో 97 నియోజకవర్గాల్లో మహిళల ఓట్లే అధికంగా ఉన్నాయి. మిగిలిన 78 నియోజకవర్గాల్లో మాత్రం పురుషుల ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్లలో మినహా మిగతా తొమ్మిది నియోజకవర్గాల్లో మహిళల ఓట్లే ఎక్కువగా పోలయ్యాయి. విజయనగరం జిల్లాలో చీపురుపల్లిలో మినహా మిగిలిన అన్ని స్థానాల్లో మహిళలే ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీమాంధ్రలో అత్యధిక సంఖ్యలో ఓట్లు వేసిన నియోజకవర్గంగా విశాఖపట్నం జిల్లాలోని భీమిలి రికార్డు సృష్టించింది. ఇక్కడ 1,05,643 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత గడ్డ వైఎస్సార్ జిల్లాలోని మొత్తం 10 నియోజకవర్గాల్లోనూ మహిళలే ఎక్కువగా ఓట్లేశారు. ఈసారి పల్లె జనం ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొనడంతో గ్రామీణ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది.
సీమాంధ్రలోని 175 నియోజకవర్గాల్లో సగటున 78.37 శాతం పోలింగ్ నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ సుమారు 85 శాతం జరిగిందని అంచనా. అనేక పట్టణ, నగర నియోజకవర్గాల్లో మాత్రం సరాసరి పోలింగ్ 62 శాతం లోపే ఉంది. సీమాంధ్రలోని 22 పట్టణ, నగర నియోజకవర్గాలను పరిశీలిస్తే నాలుగు చోట్ల మాత్రమే 70 శాతం మించి పోలింగ్ నమోదైంది. ఈ నియోజకవర్గాల్లోని పల్లెల్లో భారీగా పోలింగ్ జరగడంవల్లే ఈ మేరకైనా ఓట్లు పోలయ్యా. పల్లెలు లేని అనేక నగర నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉంది. పూర్తి నగర, పట్టణ ఓటర్లే ఉన్న విశాఖ ఉత్తర, విశాఖ పడమర స్థానాల్లో పోలింగ్ 60 శాతం లోపే ఉంది.
అలాగే విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్ లాంటి నియోజకవర్గాల్లో 64 నుంచి 65 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 59.83 శాతం పోలింగ్ జరగ్గా, ఇదే జిల్లాలోని ఎలమంచిలిలో 85.40 శాతం నమోదైంది. కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమంలో 64.99 శాతం పోలింగ్ జరగ్గా, ఇదే జిల్లాలోని జగ్గయ్యపేటలో 88.99 శాతం, పామర్రులో 87.77 శాతం నమోదైంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీలో 67.05 శాతం ఓటింగ్ జరగ్గా, ఇదే జిల్లాలోని రామచంద్రాపురంలో 87.48 శాతం, మండపేటలో 86.97 శాతం ఓట్లు పోలయ్యాయి. ప్రకాశం జిల్లా దర్శిలో అత్యధికంగా 90.96 శాతం పోలింగ్ నమోదైంది. ఇది సీమాంధ్రలో అత్యధిక పోలింగ్ జరిగిన నియోజవర్గంగా రికార్డు సృష్టించింది. నెల్లూరు జిల్లా నెల్లూరు నగర నియోజకవర్గంలో 56.38 శాతం అత్యల్ప పోలింగ్ నమోదుకాగా, ఇదే జిల్లాలోని గ్రామీణ స్థానమైన సర్వేపల్లిలో 84.90 శాతం ఓట్లు పోలయ్యాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య పోలింగ్ శాతం ఎంత తేడా ఉందో ఈ గణాంకాలనుబట్టే అర్థమవుతోంది.