నేటి నుంచి వైఎస్‌ఆర్ జనభేరి
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: పురపోరును పురస్కరించుకుని ‘వైఎస్‌ఆర్ జనభేరి’ మోగిస్తున్న ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాలో పర్యటించనున్నారు. దీంతో పార్టీ శ్రేణులు కదనోత్సాహంతో ఉన్నాయి.
తొలిరోజు విజయనగరంలో రోడ్‌షో నిర్వహించిన అనంతరం నెల్లిమర్లలోని మొయిద జంక్షన్‌లో సాయంత్రం 5 గం టలకు జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను జిల్లా పార్టీ అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, టూర్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం ప్రకటించారు.
ఉదయం 10 గంటలకు పట్టణంలోని బాలాజీనగర్‌లోని పార్టీ సమన్వయకర్త అవనాపు విజయ్ స్వగృహం నుంచి పర్యటన ప్రారంభమవుతుందని తెలిపారు. వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీనేతలు విజ్ఞప్తిచేశారు. అంతకుముందు జగన్ పర్యటనపై పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స, జిల్లా కో ఆర్డినేటర్ చేకూరి కిరణ్‌కుమార్, ఎన్నికల పరిశీలకులు పక్కి దివాకర్, సమన్వయకర్తలు అవనాపు విజయ్, గురాన అయ్యలు చర్చించారు.
రోడ్ షో వివరాలు
ఉదయం 10 గంటలకు బాలాజీనగర్‌లో రోడ్ షో ప్రారంభమవుతుంది. మయూరి జంక్షన్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, అంబేద్కర్ కాలనీ, యస్‌బీటీ మార్కెట్, ఎన్‌సీఎస్ రోడ్డు, ఎంఆర్‌ఓ కార్యాలయం రోడ్డు, బొడ్డువారి జంక్షన్, శాంతినగర్, బీసెంట్ స్కూల్ రోడ్డు మీదుగా నాగవంశపు వీధి, హుకుంపేట, కొత్తపేట జంక్షన్ మీదుగా నెల్లిమ ర్ల వెళ్తారు. సాయంత్రం మొయిద జంక్షన్‌లో జరిగే బహిరంగ సభలో నియోజకవర్గ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.అనంతరం మొయిదలో జిల్లా అధ్యక్షుడు సాంబశివరాజు స్వగృహంలో రాత్రి బస చేస్తారు.
రెండో రోజు పర్యటన వివరాలు
శనివారం ఉదయం మొయిదలో రోడ్ షో ప్రారంభమవుతుంది. గుర్ల, గరివిడి మండలా ల మీదుగా చీపురుపల్లి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు చీపురుపల్లిలో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు.